కరీంనగర్ ప్రజలను బాధించిన సీపీ బదిలీ

by Naveena |

విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణమే

కరీంనగర్ ప్రజలను బాధించిన సీపీ బదిలీ
X

దిశ బ్యూరో కరీంనగర్ : విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణమే. అయినప్పటికీ కొంత మంది అధికారులు ప్రజల గుండెల్లో చెరిపినా చెదరని స్థానం సంపాదించుకుంటారు. అలాంటి అధికారుల్లో ఒకరు కరీంనగర్ సీపీగా విధులు నిర్వర్తించిన అభిషేక్ మహంతి. ఖద్దరు నేతల కబంద హస్తాల్లో బందీ అయి కమీన పనులు చేసిన ఖాకీలకు సైతం పోలీస్ పవర్ చూపించి కొదమ సింహంలా వ్యవహరించిన పోలీస్ అధికారి ఆయన. ఇప్పుడు సదరు అధికారి బదిలీ కరీంనగర్ జనాన్ని బాధించి భావోద్వేగానికి గురిచేస్తున్నది.

కమీన వ్యవహారాలను కట్టడి చేసిన కమీషనర్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కమీన వ్యవహారాలను కట్టడి చేసి ఖాకీల పవర్ పెంచిన పోలీస్ బాస్ కరీంనగర్ సీపీగా పనిచేసి బదిలీ పై వెళ్తున్న పోలీస్ కమీషనర్ అభిషేక్ మహంతి. సచ్చుపడిపోయిన ఖాకీల పవర్ పెంచి ఖాకీలు అంటే ఇలా ఉండాలని ప్రజల్లో పోలీసుల పనితీరును మెరుగుపరచిన డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న పోలీస్ ఆఫీసర్. అలా ప్రజల మన్ననలు పోంది ఇప్పుడు బదిలీపై వెళ్లడం కరీంనగర్ ప్రజానీకాన్ని బాధిస్తుంది. కమిషనరేట్ పరిధిలో ఎక్కడ చూసిన అభిషేక్ మహంతి బదిలీ పై చర్చించుకుంటూ జనం భావోద్వేగానికి గురైతున్నారు.

శభాష్‌ పోలీస్‌ బాస్

కరీంనగర్ చరిత్రలో ఓ పోలీస్ అధికారి చెరగని ముద్ర వేశారంటే అభిషేక్ మహంతి అని చెప్పక తప్పదు. కల్లోల జిల్లాగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లాలో ఖాకీలు ఖద్దరు నేతల చేతుల్లో బంది అయి కళ్లున్నా కబోదుల్లా వ్యవహరించి ఖాకీ పరువును తీయగా కరీంనగర్ పోలీస్ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అభిషేక్ మహంతి అక్రమార్కుల ఆటలు కట్టించి పోలీసు చరిత్రలో చెరగని ముద్రవేశారని అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి అధికారి బదిలీకావడంతో యావత్ జిల్లా బరువైన గుండెతో బదిలీ అయిన అధికారి శభాష్ పోలీస్ బాస్ అంటూ ప్రణవిల్లుతుంది. సహజంగా బదిలీ అయిన అధికారుల పట్ల బాధ సహజమే అయినప్పటికీ.. ప్రజల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన అభిషేక్ మహంతి బదిలి జిల్లాను కుదిపేసింది.

Next Story