- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు భద్రత.. జీవన రక్ష : సీపీ గౌస్ ఆలం
ప్రతి ఒక్కరూ విధిగా రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సూచించారు.

దిశ, హుజూరాబాద్ రూరల్ : వేగం కంటే ప్రాణం మిన్న అని.. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పిలుపునిచ్చారు. గురువారం సింగాపురం పరిధిలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు నిర్వహించిన 'రోడ్డు భద్రత - అవగాహన' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి రోజూ ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే చనిపోవడం లేదని ఆ కుటుంబం మొత్తం వీధిన పడి విషాదంలో మునిగిపోతుందని గుర్తుచేశారు.
ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, ఇది కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాదు, ప్రాణాలను కాపాడుకోవడానికి అని గుర్తించాలన్నారు. జంక్షన్ల వద్ద, రోడ్డు దాటేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, వాహనాల బ్రేక్ కండిషన్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని తెలిపారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి కీలక పత్రాలను కలిగి ఉండాలని చెప్పారు. సుదీర్ఘ ప్రయాణాలు (లాంగ్ డ్రైవ్స్) చేసే సమయంలో అలసట వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయని, కనీసం ప్రతి రెండు గంటలకోసారి వాహనాన్ని నిలిపి విశ్రాంతి తీసుకోవడం శ్రేయస్కరం అని సూచించారు. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల విచక్షణ కోల్పోయి ఘోర ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. వేగం ఎప్పుడూ ప్రాణాంతకమేనని గ్రహించాలని పేర్కొన్నారు. "మీ ఇంట్లో మీపై ఆధారపడి తల్లిదండ్రులు, పిల్లలు ఉంటారు. మీ అజాగ్రత్త వారి భవిష్యత్తును అంధకారం చేస్తుంది. జీవితం చాలా విలువైనది, దానిని రోడ్డు ప్రమాదాల్లో బలి చేయకండి"అని పోలీస్ కమిషనర్ అన్నారు.
భారీ వాహనాలు ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా మలుపుల వద్ద వేగాన్ని తగ్గించాలని సీపీ సూచించారు. రాత్రి వేళల్లో పాదచారులు అకస్మాత్తుగా రోడ్డు పైకి వచ్చే అవకాశం ఉన్నందున డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, పాదచారులు కూడా వాహనాల రాకపోకలను గమనించిన తర్వాతే రోడ్డు దాటాలని సూచించారు. అనంతరం కళాశాల విద్యార్థులతో ప్రతిజ్ఞత చేయించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మాధవి, సీఐలు కరుణాకర్, వెంకట్, లక్ష్మినారాయణ, ఎస్ఐలు యూనస్, స్వాతి, శేఖర్, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






