పెద్దపల్లి జిల్లాలో ఆగని ‘అవినీతి’ దాహం.. వరుస దాడులతో అవినీతి పరుల హడల్

by Ajay Maddhiboyina |

పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. రెవెన్యూ, మున్సిపల్, .. ఇలా శాఖ ఏదైనా లంచం లేనిదే పని జరగడం లేదు.

పెద్దపల్లి జిల్లాలో ఆగని ‘అవినీతి’ దాహం.. వరుస దాడులతో అవినీతి పరుల హడల్
X

దిశ,పెద్దపల్లి: అది సర్కారు ఆఫీసు.. ప్రజలకు సేవ చేయాల్సిన దేవాలయం.. కానీ అక్కడ అడుగు పెడితే చాలు ఆమ్యామ్యాల’గోల వినిపిస్తోంది. ఫైలు కదలాలంటే చేతులు తడపాల్సిందే.. సంతకం పెట్టాలంటే నోట్ల కట్ట సమర్పించాల్సిందే. పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం అవినీతి ఊబిలో కూరుకుపోతోంది. ఒకపక్క ఏసీబీ అధికారులు వరుస దాడులతో ఉచ్చు బిగిస్తున్నా.. లంచావతారుల తీరు మాత్రం ‘కుక్క తోక వంకర’ అన్న చందంగానే తయారైంది.

గత కొద్ది రోజులుగా పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. రెవెన్యూ, మున్సిపల్, .. ఇలా శాఖ ఏదైనా లంచం లేనిదే పని జరగడం లేదు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహిస్తున్నారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన పలువురు అధికారులు కటకటాల పాలయ్యారు. ఈ దాడులతో నిజాయితీగా పనిచేసే ఉద్యోగుల్లో భయం లేకపోయినా.. అవినీతి తిమింగలాల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి.

చిక్కినా.. సిగ్గుపడని తీరు

సాధారణంగా పక్క సీటులో ఉన్న అధికారి ఏసీబీకి చిక్కితే.. కనీసం కొద్ది రోజులైనా మిగతా వారిలో మార్పు వస్తుంది. కానీ పెద్దపల్లి జిల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ‘వాడు దొరికాడు.. నాకేం కాదు’ అన్న ధీమాతో మిగిలిన అధికారులు యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏసీబీకి చిక్కిన సైతం తీరు మార్చుకోని అధికారుల వైఖరిపై ప్రజలు మండిపడుతున్నారు. జైలుకు వెళ్లొచ్చినా మళ్లీ పాత దందానే కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

చెప్పలరిగేలా తిరుగుతన్న ప్రజలు

చిన్న పని కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ జనం చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఇంటి పర్మిషన్లు, భూమి రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్లు, సంక్షేమ పథకాలు.. ఇలా ఏ పని కావాలన్నా లంచం ఇవ్వనిదే అధికారి కరుణించడం లేదు. ‘డబ్బులిస్తేనే ఫైలు టేబుల్ మీదకు వస్తుంది, లేదంటే దుమ్ము కొట్టుకుపోవాల్సిందే’ అని సామాన్యులు వాపోతున్నారు. లంచం ఇవ్వలేని నిరుపేదలు ప్రభుత్వ ఆఫీసుల మెట్లెక్కి దిగుతూనే ఉన్నారు.

అవినీతి అధికారుల చిట్టా సిద్ధం?

అవినీతిని అంతం చేయడానికి ఏసీబీ తన వలయాన్ని విస్తరించింది. జిల్లాలో అవినీతి అధికారుల చిట్టా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎవరైనా అధికారి లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా వెంటనే 14400 టోల్ ఫ్రీ నంబర్ కు లేదా ఏసీబీ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. ప్రజలు ధైర్యంగా ముందుకు వస్తేనే ఈ లంచావతారాల భరతం పట్టగలమని ఏసీబీ స్పష్టం చేస్తోంది.

Next Story