- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీఏ ఆఫీసులో ఏజెంట్ల హవా.. చక్రం తిప్పుతున్న ఆ ఐదుగురు
అక్కడి రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. కార్యాలయంలో రోజు రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయి. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి అవి అధికారులకు ముడితేనే పైళ్లు ముందుకు కదులుతున్నాయి.

దిశ బ్యూరో, కరీంనగర్ : అక్కడి రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. కార్యాలయంలో రోజు రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయి. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి అవి అధికారులకు ముడితేనే పైళ్లు ముందుకు కదులుతున్నాయి. సాయంత్రం మూడు గంటల నుంచి 4గంటల వరకు గంట సమయం కేటాయించి వసూళ్లకు పాల్పడుతున్నారు. అందుకోసం చేతికి మట్టి అంటకుండా అధికారులు ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నారు. ఇలా ఏర్పాటు చేసుకున్న ఓ ఐదుగురు వ్యక్తులు వసూళ్ల బాధ్యతను తీసుకుని అక్కడ చక్రం తిప్పుతున్నారు. కోడింగ్ డీ కోడింగ్ భాషలో వ్యవహారం నడిపిస్తున్న అధికారులు డబ్బులు ఇస్తే ఆ ఫైల్ పై ఓ నంబర్ లేదా ఓ పేరు రాస్తారు. అది తీసుకెళ్తే ఏ బ్రోకర్ ఏజెంట్ పంపించారో అధికారులకు ఇట్టే తెలిసిపోతుంది. అలా లేని ఫైళ్లను పక్కన పడేస్తున్నారు. అడిగే వారు లేకపోవడంతో రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని రవాణాశాఖ కార్యాలయంలో అక్రమార్కులు తిష్ట వేసి వసూళ్ల పర్వం సాగిస్తున్నారు.
అక్కడ ఆ ఐదుగురే కీలకం...
ప్రభుత్వ కార్యాలయాల్లో పాలన పారదర్శకంగా సాగాలి. కానీ అక్కడ అడిగే వారు లేకపోవడంతో అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని అక్రమ వ్యవహారాలు సాగిస్తున్నారు. వాహనాల తనిఖీలు, పిట్ నెస్ కోసం కార్యాలయానికి వచ్చే వాహన యజమానులతో డీల్ కుదుర్చుకుని పని కానిచ్చేస్తున్నారు. అందుకు తనిఖీలు చేస్తున్న సమయంలో వీరిని పక్కనే పెట్టుకుని వారి సూచనల మేరకు పిట్ నెస్ ఇతరత్రా పనులు ముగిస్తున్నారు. అడిగినంత ముట్టజెప్పగానే మూడో కంటికి కనపడకుండా పని కానిచ్చేస్తున్నారు. అందుకోసం ఓ ఐదుగురు వ్యక్తులను ఏర్పరుచుకుని అనిశా అధికారులకు చిక్కకుండా పని ముగించేస్తున్నారు. నేరుగా పనుల కోసం వెళ్లే వారిని గుర్తించి వారి పైళ్లను పక్కన పెట్టేస్తున్నారు. దీంతో పలు పనులపై కార్యాలయానికి వచ్చే వారు ఆ ఐదుగురిలో ఓక్కరిని మచ్చిక చేసుకుంటే తప్పా వారి పని అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో వారిని ఆశ్రయించక తప్పడం లేదు. అలా ఆశ్రయించిన వారికి ఏజెంట్లు రేటు పిక్స్ చేసి చెబుతారు. ఆ మొత్తం వారికి అప్పగించగానే పైల్ ముందుకు సాగుతుంది. ఇలా ఎక్కడా చిక్కకుండా రోజు రూ.లక్షల వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
అటెండర్ నుంచి అధికారి వరకు వాటాలే...
అవినీతి అడ్డగా మారిన రాజన్న సిరిసిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ప్రతి పనికి ఓ రేటు పిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. అయితే సిబ్బంది అటెండర్ నుంచి అధికారి వరకు ఎవరి వాట వారు పంచుకుంటున్నారు. ఎవరి వాట వారికి ముట్టడంతో ఎక్కడ ఏ అడ్డు లేకుండా సంవత్సరాల తరబడి వసూళ్ల పర్వం సాగుతుంది. అందుకు ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న అధికారులు ఏజెంట్ల ద్వారా డబ్బులు లాగుతూ రోజు సాయంత్రం వాటాలుగా పంచుకుంటు ఏ రోజు ఆదాయం అదేరోజు లాగేసుకుంటున్నారు. ఇలా వసూళ్ల కోసం ఆఫీసులో తిష్ట వేసిన ఏజెంట్లు వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే వారిని ముందుగా వారి సమస్య తీవ్రతను తెలుసుకుని ఆ పని జరగాలంటే ఓ రేటు పిక్స్ చేసి పెడతారు. ఇక ఆ రేటు అధికారికి చేరాలంటే బాధితులు ఎవరో ఒక్కరిని ఆశ్రయించాల్సిందే. అలా ఏజెంటు ద్వారా ఆ మొత్తాన్ని రాబడతారు. అందుకోసం ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించిన రుసుం కన్నా అధిక మొత్తంలో ముందుగానే ఏజెంటుకు సమర్పించాలి. అలా కాకుండా నేరుగా వెళ్తే... అది లేదు.. ఇది లేదంటూ పైళ్లను పక్కన పడేస్తారు. దీంతో మధ్యవర్తులను ఆశ్రయించక తప్పడం లేదు. వారు అడిగినంత ముట్టజెప్పి పనిని ముగించుకుంటున్నారు. దీంతో సాధారణ ప్రజల నుంచి పైస్థాయి వ్యక్తుల వరకు ఆర్టీవో కార్యాలయం వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. అక్కడ పైసా లేనిదే పని జరగట్లేదని, పైసా ఇవ్వకపోతే పక్కన పెట్టేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. అక్కడ డబ్బుంటే ఏ పని అయినా జరిగిపోతుంది. డబ్బు ఇస్తే ఎంతటి పనైనా చిటికెలో పూర్తయ్యేలా ఇక్కడ షాడో నెట్ వర్క్ పనిచేస్తుంది. ఇదంతా పై స్థాయి అధికారులకు తెలియకుండా జరగదని, వారికి ఇందులో పాత్ర ఉందనేది బహిరంగ రహస్యమని పలువురు చర్చించుకుంటున్నారు.
అంతా కోడింగ్.. ఢీ కోడింగ్ భాషలోనే...
రవాణా శాఖ కార్యాలయానికి పనుల కోసం వచ్చే వారికి పనులు జరగాలంటే అక్కడి పద్ధతులు వారికి తెలియాలి. అలా ఎందుకు అని నేరుగా వెళ్లారనుకోండి ఫైళ్లు పక్కన పడేసి నెలల తరబడి ఆఫీస్ చుట్టూ తిప్పేస్తారు. దీంతో అక్కడికి వచ్చేవారు ఏజెంట్లను ఆశ్రయించక తప్పడం లేదు. ఏజెంట్లకు అప్పగించిన ఫైళ్లకు ప్రైవేటు వ్యక్తులు రేటు పిక్స్ చేస్తారు. వాళ్లు పిక్స్ చేసిన మొత్తాన్ని ఏజెంటు కమీషను పట్టుకుని క్లైయింట్ల నుంచి ఏజెంట్లు వసూళ్లు చేస్తారు. ఆ పైళ్ల పై ఏజెంట్లు కోడింగ్ బాషలో ఏదైన అంకెలు లేదా సంకేతం తెలిపే సంఖ్యలు వేసి పంపిస్తారు. ఆ ఫైళ్లను మాత్రమే అధికారి దగ్గరికి తీసుకెళ్తారు సిబ్బంది. ఆ కోడ్ చూసిన అధికారి ఆ మొత్తాన్ని సాయంత్రం 3గంటలనుంచి 4వరకు ఏజెంట్ల ద్వారా తీసుకుంటారు. ఈ దందాలో అటెండర్ నుంచి మొదలుకుని అధికారి వరకు పాత్ర ఉంటుందని, పని సమయం ముగియగానే ఎవరి వాట వారు ఏజెంట్ల ద్వారా తీసుకుని ఇంటికి వెళ్తారు. అలా కాకుండా ఎవరైనా ప్రశ్నిస్తే ఇక వారి సంగతి అంతే. పని అసలు జరగదు. పైగా ఎక్కువ మాట్లాడితే అధికారులతో దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ కేసులు పెట్టిస్తారు. దీంతో వారిని ప్రశ్నించలేక పని ఆపుకోలేక అడిగినంత సమర్పించి పని ముగించుకుని పరిస్థితిని కల్పిస్తారు.
వివరణకు అందుబాటులోకి రాని అధికారులు
రవాణా శాఖ కార్యాలయంలో జరుగుతున్న అక్రమ వసూళ్లు ఏజెంట్ల దందాపై స్థానిక డీటీసీ లక్ష్మణ్‌ను వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా సంప్రదించగా వారు ఫోన్‌కు స్పందించలేదు. దీంతో సమాచారాన్ని టెక్స్ట్ మెసెజ్ ద్వారా చేరవేయడంతో ఈ రోజు మాట్లాడడం కుదరదు. రేపు కలవండి అంటూ సందేశం పంపారు.






