- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీతం కోసం లంచం.. కాంట్రాక్ట్ ఉద్యోగి దందా..
జమ్మికుంట మున్సిపాలిటీలో అవినీతి తిమింగలాలు అడ్డూఅదుపు లేకుండా చెలరేగిపోతున్నాయి. చెమటోడ్చి నగరాన్ని శుభ్రం చేసే పారిశుధ్య కార్మికుల నోటికాడ కూడును కాంట్రాక్ట్ ఉద్యోగులు పిండుకుంటున్నారు.

దిశ, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపాలిటీలో అవినీతి తిమింగలాలు అడ్డూఅదుపు లేకుండా చెలరేగిపోతున్నాయి. చెమటోడ్చి నగరాన్ని శుభ్రం చేసే పారిశుధ్య కార్మికుల నోటికాడ కూడును కాంట్రాక్ట్ ఉద్యోగులు పిండుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెరగాల్సిన జీతాల పెంపును తమకు కాసుల వర్షం కురిపించే వనరుగా మార్చుకున్నారు. జీతం పెరగాలంటే తమ జేబులు నింపాల్సిందేనని హుకుం జారీ చేస్తున్న వైనం ఇప్పుడు స్థానికంగా పెను సంచలనంగా మారింది.
జీతం పెరగాలంటే.. రూ. 80 వేలు ఇవ్వాల్సిందే
మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లుగా పని చేస్తున్న అమాయక కూలీలను ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘మీకు జీతం పెరగాలన్నా, రేపు పొద్దున ఉద్యోగం ఉండాలన్నా నేను చెప్పినంత ఇచ్చుకోవాలి’అంటూ ఒక్కో ఉద్యోగి వద్ద ఏకంగా రూ. 80,000 డిమాండ్ చేసినట్లు బాధితులు వాపోతున్నారు. డిమాండ్ చేసినంత ఇచ్చుకున్న వారికి జీతాల పెంపు వర్తింపజేసి, కేవలం రూ. 50 వేలు మాత్రమే ఇచ్చిన వారికి మొండిచేయి చూపినట్లు తెలుస్తోంది. ఈ దందా ద్వారా ఇప్పటివరకు సుమారు రూ. 10 లక్షల మేర అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు కార్మికులు గొంతెత్తుతున్నారు.
ఏసీబీ రిపోర్ట్ ఉన్నా.. చర్యలేవి?
ఈ కాంట్రాక్ట్ ఉద్యోగిపై గతంలోనే భారీగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీనిపై గతంలోనే ఏసీబీ, విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి అక్రమాలు జరిగినట్లు నిర్ధారించినట్లు సమాచారం. అయినప్పటికీ, ఉన్నతాధికారులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద ఎత్తున అంతర్గత ఒప్పందాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘అధికారుల వాటా వారికి వెళ్తోంది కాబట్టే.. ఈ వసూల్ రాజా ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు’ అని తోటి కార్మికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
బెదిరింపులకు భయపడబోం: బాధితులు
తమ న్యాయమైన హక్కుల కోసం అప్పులు చేసి లంచాలు ఇవ్వాల్సిన దుస్థితిపై డ్రైవర్లు, కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు అడిగిన విషయాన్ని బయటకు చెబితే ఉద్యోగాల నుంచి తీసివేస్తామంటూ సదానందం బెదిరింపులకు దిగుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘రాత్రింబవళ్లు కష్టపడే మా పొట్ట కొడుతున్న ఈ అవినీతి తిమింగలాలపై చర్యలు ఎప్పుడు?" అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
కలెక్టర్ స్పందించాలి.. లేదంటే ఆందోళన తప్పదు..
మున్సిపల్ వ్యవస్థలో వేళ్లూనుకున్న ఈ అవినీతి నెట్‌వర్క్‌పై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. దోచుకున్న సొమ్మును వెనక్కి ఇప్పించడంతో పాటు ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి, అవినీతి ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.






