- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండగట్టులో ఆర్జిత సేవల రేట్ల పెంపు వివాదం
కొండగట్టు అంజన్న ఆలయంలో ఆర్జిత సేవల టికెట్ల రేట్ల పెంపు భక్తుల ఆగ్రహానికి కారణమైంది. స్వామివారిని దర్శించుకునే పేద,

దిశ, జగిత్యాల ప్రతినిధి : భూతప్రేత పిశాచాలను పారద్రోలే దేవుడిగా విశ్వాసం పొందిన కొండగట్టు అంజన్న ఆలయంలో ఆర్జిత సేవల టికెట్ల రేట్ల పెంపు భక్తుల ఆగ్రహానికి కారణమైంది. స్వామివారిని దర్శించుకునే పేద, మధ్యతరగతి భక్తులపై అదనపు భారాన్ని మోపడం సరైన నిర్ణయం కాదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులతో పాటు పలువురు భక్తులు ఈ నిర్ణయం పై పునరాలోచించాలని ఆలయ అధికారులను కలిసి విన్నవించారు. గురువారం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సైతం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో శ్రీకాంత్ రావును హైదరాబాద్ ఎండోమెంట్స్ కార్యాలయానికి పిలిపించిన కమిషనర్, రేట్ల పెంపుపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. అనంతరం తాత్కాలికంగా ఆర్జీత సేవా టికెట్ల రేట్ల పెంపు, కొత్త ఆర్జిత సేవల అమలు వాయిదా వేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
ఆలయ అధికారుల యూటర్న్
నవంబర్ 5వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆలయ ఈవో శ్రీకాంత్ రావు టెంపుల్ అభివృద్ధిలో భాగంగా కొత్త ఆర్జీత సేవలను ప్రవేశపెట్టడంతో పాటు ఇదివరకే ఉన్న ఆర్జిత సేవల టికెట్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించారు.. పెంచిన రేట్లు నవంబర్ 15వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మరుసటి రోజు నుంచే భక్తులతో పాటు స్థానికంగా ఉన్న నాయకులు రేట్ల పెంపు విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపకుండా రేట్లు పెంచడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. మౌలిక వసతులు పూర్తి స్థాయిలో సక్రమంగా లేని ఆలయంలో ముందుగా భక్తులకు సౌకర్యాలు కల్పించి, ఆ తర్వాతే రేట్ల పెంపు ఆలోచించాలని వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగా ఇది తాత్కాలికమేనా? లేక పూర్తిగా రద్దు చేసినట్టా.. అనేది వేచిచూడాల్సి ఉంది.
ఏళ్లుగా వెక్కిరిస్తున్న సమస్యలు
ఆర్జిత సేవల టికెట్ల రేట్లు పెంపు అంశంతో కొండగట్టులో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. అంజన్న దర్శనానికి వచ్చే భక్తులు ప్రధానంగా పార్కింగ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఆలయానికి ఏటేటా ఆదాయం పెరుగుతున్న పార్కింగ్ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. సరిపడా అద్దె గదులు లేక పోవడం, కొండపై నాలుగు చోట్ల టాయిలెట్స్ ఉన్నా ఎక్కడున్నాయో తెలియక బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాలకు వెళ్లడం ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా మెట్ల మార్గం అభివృద్ధికి నోచుకోక పూర్తిగా దుర్గంద భరితంగా మారింది. ఒక మాటలో చెప్పాలంటే మెట్ల మార్గం గుండా కాలినడకన వచ్చే భక్తులు ముక్కు మూసుకొని రావాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక కొండపై భక్తులు అడుగు పెట్టింది మొదలు దర్శనం పూర్తి చేసుకునే లోపే దుకాణదారులు నిలువు దోపిడీ చేసేస్తున్నారు. ముందుగా ఇలాంటి సమస్యలకు ఓ పరిష్కారం చూపిన తర్వాతనే రేట్ల పెంపు విషయాన్ని ఆలోచించాలని భక్తులు అధికారుల వైఖరిని ఎండగడుతున్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం..
ఆర్జిత సేవల టిక్కెట్ల రేట్ల పెంపు నిర్ణయంపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆలయ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన బండి భక్తులకు కనీస వసతులు కల్పించకుండా రేట్లు పెంచి భారం మోపడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవాలయాలను ఆదాయ వనరులుగా చూడకూడదన్న బండి సంజయ్ ఈ విషయమై ఎండోమెంట్ అఫీషియల్స్ తో మాట్లాడినట్లు తెలిపారు. ముందుగా వసతులు కల్పించడంతో పాటు ఆర్జిత సేవల టికెట్ల రేట్లు పెంపు నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
పాత రేట్లనే కొనసాగించాలి
గాజుల మల్లేశం మల్యాల మండల బీజేపీ అధ్యక్షుడు
ఆర్జిత సేవల టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో అధికారులు పాత రేట్లనే కొనసాగించాలి. ఈ విషయమై ఇదివరకే ఆలయ ఈవో కు వినతి పత్రం అందజేశాం. పేద మధ్యతరగతి భక్తుల ఇబ్బందులను దృష్టిలో అధికారులు నిర్ణయాలు తీసుకోవాలి. ఆలయంలో ప్రధాన సమస్యగా ఉన్న పార్కింగ్, అద్దెగదులు, మెట్ల మార్గం అభివృద్ధి తదితర సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలి. భక్తులకు ఇబ్బందులు కలిగేలా నిర్ణయాలు తీసుకోకూడదు.






