ధర్మపురి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్

by Ratna Kumari |

ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో తాజాగా మున్సిప‌ల్ పీఠాన్ని ద‌క్కించుకుంది. చైర్మ‌న్ గా వేముల నాగ‌ల‌క్ష్మి రాజేష్, వైస్ చైర్మ‌న్ గా ఇందార‌పు రామ‌య్య ఏక‌గ్రీవంగా ఎన్నికయ్యారు.

ధర్మపురి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్
X

దిశ, వెల్గటూర్ : ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ధర్మపురి మున్సిపాలిటీలో సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు బల నిరూపణ జరగగా.. మున్సిపల్ చైర్మన్ గా వేముల నాగలక్ష్మి రాజేష్, వైస్ చైర్మన్ గా ఇందారపు రామయ్య వార్డు సభ్యులందరి మద్దతు తో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో ఆర్డిఓ మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సభ్యులందరికీ విప్ జారీ చేశారని, విప్ ధిక్కరిస్తే వారి సభ్యత్వాన్ని కోల్పోతారని ఆర్డీవో సభ్యులందరికి సూచించారు. చైర్మన్ అభ్యర్థిగా వేముల నాగలక్ష్మి రాజేష్ ను ఓజ్జల లక్ష్మణ్ ప్రతిపాదించగా అయ్యేరి వేణుగోపాల్ బలపరిచారు. వైస్ చైర్మన్ గా ఇందారపు రామయ్యను కొమురెల్లి పవన్ కుమార్ ప్రతిపాదించగా.. వి. విజయ్ బాబు బలపరిచారు .ఈ క్రమంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలుపగా చైర్మన్ గా వేముల నాగలక్ష్మి రాజేష్ కాంగ్రెస్ , వైస్ చైర్మన్ గా ఇందారపు రామయ్య కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డిఓ మధుసూదన్ గౌడ్ ప్రకటించారు.


ఈ ఎన్నిక మున్సిపల్ కార్యాలయంలో మంత్రి ఆడ్లూరి లక్ష్మన్ కుమార్ సమక్షంలోనే జరుగగా సభ్యులందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలుపటం విశేషం.మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు నుంచే ధర్మపురి మున్సిపాలిటీ చైర్మన్ రేసులో వేముల నాగలక్ష్మి తో పాటు సంఘన భట్ల సంతోషి దినేష్ అనే ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా వీరిద్దరూ అదే టెంపొను కొనసాగించారు. ధర్మపురిలో అన్ని స్థానాలు గెలిచినా చైర్మన్ ఎన్నిక పై కాస్త సందిగ్ధం నెలకొంది. ఇద్దరు మంత్రి మనుషులే కావటంతో మంత్రి చైర్మన్ ఎన్నిక విషయంలో కాస్త ఇబ్బంది పడ్డారు. ఇలా ఉంటుందని ముందే గ్రహించిన మంత్రి పలితాలకు ముందే అందరిని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పొనుగోటీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హైదరాబాద్ లో క్యాంపు నిర్వహించారు. క్యాంపులో కూడా చివరి వరకు ఎవ్వరూ చైర్మన్ అనేది తేలలేదు. దీంతో చైర్మన్ పీఠం పై పీఠముడి ఏర్పడింది. చివరి రోజు మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్‌ కుమార్, పొనుగోటీ శ్రీనివాసరావు తమదైన శైలిలో ఇద్దరు కలిసి సభ్యులతో కరీంనగర్ లో మకాం వేసి దినేష్ ను ఒప్పించి చైర్మన్ పదవి నాగలక్ష్మి కి ఇచ్చే విధంగా ఒప్పించటంతో ధర్మపురి మున్సిపల్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది.

Next Story