- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ అంటేనే కరువు..ప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే ఫైర్..!
“కాంగ్రెస్ అంటేనే కరువు”, రైతుల సమస్యలపై ప్రభుత్వంమీద మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫైర్ అయ్యారు.

దిశ, గంగాధర : “కాంగ్రెస్ అంటేనే కరువు”, రైతుల సమస్యలపై ప్రభుత్వంమీద మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫైర్ అయ్యారు. ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గంగాధర మండలంలోని గోపాలరావుపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల పాటు రైతులకు సకాలంలో నీళ్లు, యూరియా, రైతుబంధు వంటి పథకాల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు చేసుకునే పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎండలు ముదిరి పంటలు ఎండిపోతున్నా, రైతులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. “దున్నపోతు మీద వాన పడ్డట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రైతుల బాధల పట్ల నిమ్మకు నీరెత్తినట్టుగా స్పందిస్తోంది” అని ఆరోపించారు. చొప్పదండి నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో సకాలంలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. నారాయణపూర్ కుడికాల్వ పనులను తమ బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని, ఆ పరివాహక ప్రాంత రైతులకు నీళ్లు అందించే విషయంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా కొండాపూర్ మైసమ్మ చెరువును నింపి, డి-4 కాలువ ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో రైతుబంధు అంశంపై నిర్ణయం తీసుకుంటారని రైతులు ఆశగా ఎదురు చూశారని, కానీ వారికి నిరాశే మిగిలిందని అన్నారు. ఇప్పటివరకు మూడు దఫాలుగా రైతుబంధు బకాయిలుగా రూ.27 వేల కోట్లు ఎగ్గొట్టినట్లు ఆరోపించారు.
చొప్పదండి నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే పెద్ద పెద్ద మాటలు చెప్పడమే తప్ప క్షేత్రస్థాయిలో రైతులను పరామర్శించలేదని విమర్శించారు. “ఒక్క ఎకరం కూడా ఎండిపోనివ్వనని చెప్పిన మీరు, పంట పొలాల్లోకి వెళ్లి రైతుల బాధలు తెలుసుకున్నారా?” అంటూ ప్రశ్నించారు. ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.25,000 చొప్పున నష్టపరిహారం తక్షణమే అందించి, సకాలంలో సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.






