రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

by Kodari Anjali |

రూ.1.30 కోట్లతో సర్దాపూర్ మార్కెట్ యార్డులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నూతన ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సర్దాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.1.30 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మార్కెట్ యార్డుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రైతులు పండించిన పంటలను భద్రంగా మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయించేందుకు అవసరమైన వసతులను దశలవారీగా కల్పిస్తున్నామన్నారు. సర్దాపూర్ మార్కెట్ యార్డులో నిర్మించనున్న ప్రహరీ గోడ పూర్తైతే యార్డు భద్రత మరింత బలోపేతం అవడంతో పాటు మార్కెట్ నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగేందుకు ఉపయోగపడుతుందన్నారు. రైతులు, వ్యాపారులు, హమాలీలు తదితరులకు అనుకూలమైన వాతావరణం కల్పించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రైతు సంక్షేమానికి అవసరమైన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని విప్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ వేలుమల స్వరూప తిరుపతి రెడ్డి, జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ నరసయ్య గౌడ్ మార్కెట్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story