​ప్రాణ వాయువుతో వచ్చి.. ఓటు వేసి!

by Ratna Kumari |

అనారోగ్యం బాధిస్తున్నా ప్రాణం కడబొట్టున ఉన్నా.. ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనడమే తన ప్రథమ కర్తవ్యమని చాటింది ఓ వృద్ధురాలు.

​ప్రాణ వాయువుతో వచ్చి.. ఓటు వేసి!
X

దిశ,​ హుజూరాబాద్ రూరల్ : అనారోగ్యం బాధిస్తున్నా ప్రాణం కడబొట్టున ఉన్నా.. ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనడమే తన ప్రథమ కర్తవ్యమని చాటింది ఓ వృద్ధురాలు. ఆక్సిజన్ సిలిండర్ సాయంతో అంబులెన్స్‌లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. హుజూరాబాద్ పట్టణంలోని 21వ వార్డుకు చెందిన అయిత యశోద (80) గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె తన ఇంటి వద్ద అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. గురువారం హుజూరాబాద్‌లో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో తన ఓటును వదులుకోవడం ఇష్టం లేక ఆమె పట్టుబట్టారు. దీంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి ఆక్సిజన్ సిలిండర్ సాయంతో ఆమెను హుజూరాబాద్‌లోని 41వ పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. ముక్కుకు ప్రాణవాయువు గొట్టాలు ఉన్నప్పటికీ, ఏమాత్రం తడబడకుండా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఆమె తన ఓటు వేశారు.

ప్రశంసల జల్లు..

వృద్ధాప్యం, అనారోగ్యం వెన్నాడుతున్నా ఆమె చూపిన ఈ పట్టుదలను చూసి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న అధికారులు, ఓటర్లు ఆశ్చర్యపోయారు. "ఓటు వేయడానికి యువతే బద్ధకిస్తున్న ఈ రోజుల్లో, యశోదమ్మ చూపిన ఉత్సాహం అందరికీ కళ్లు తెరిపించేలా ఉంది" అని అక్కడి వారు ప్రశంసించారు. ఓటు వేసిన అనంతరం ఆమెను తిరిగి అంబులెన్స్‌లో ఇంటికి తరలించారు.

Next Story