రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

by velandi.Saikiran |

స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి, నామినేషన్, ఎన్నికల

రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి, నామినేషన్, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రెండు విడతల్లో జడ్పిటిసి, ఎంపిటిసి స్థానాలకు, రెండు విడతల్లో గ్రామ పంచాయతీలకు ( సర్పంచ్, వార్డు సభ్యులు) ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపారు. మొత్తం నాలుగు విడతల్లో జిల్లాలో ఎన్నికలు ముగుస్తాయని అన్నారు.

మొదటి విడతలో హుజురాబాద్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని (6మండలాలు) ఇల్లంతకుంట, జమ్మికుంట, హుజురాబాద్, శంకరపట్నం, వీణవంక, వి సైదాపూర్ మండలాల్లో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. రెండవ విడతలో కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని (9 మండలాలు) చిగురుమామిడి, చొప్పదండి, గంగాధర, గన్నేరువరం, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, మానకొండూర్, రామడుగు, తిమ్మాపూర్ మండలాల్లో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరుగుతాయని అన్నారు.

మూడవ విడతలో కరీంనగర్ డివిజన్ పరిధిలోని మానకొండూర్ మండలం మినహా అన్ని మండలాలల పరిధిలోని గ్రామపంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. నాలుగో విడతలో హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలు సహా మానకొండూర్ మండల పరిధిలోని గ్రామపంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ఉంటాయని అన్నారు. సర్పంచ్ వార్డు, సభ్యుల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నిర్వహించిన అదే రోజు ఫలితాలు వెలుపడతాయని అన్నారు.

జడ్పిటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపు నవంబర్ 11న ఉంటుందని అన్నారు. ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలకు ప్రతి మూడు, నాలుగు మండలాలకు ఒక ఆర్ఓ ను నియమిస్తున్నామని, మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అన్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లాలో ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల, అంబేద్కర్ స్టేడియం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి అర్హతలు, ధరావత్తు వివరాలు, ఎన్నికల వ్యయం, నామినేషన్ ప్రక్రియ తదితర వివరాలను గురించి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే వివరించారు.

అనంతరం పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, బిజెపి ప్రతినిధులు నాంపల్లి శ్రీనివాస్, బాస సత్యనారాయణ, వాసాల రమేష్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు సిరాజ్ హుస్సేన్, మడుపు మోహన్, బిఆర్ఎస్ ప్రతినిధి సాతినేని శ్రీనివాస్, సిపిఐ(ఎం) ప్రతినిధి మిల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఐ ప్రతినిధి కే.మణికంఠ రెడ్డి, ఏఐఎంఐఎం ప్రతినిధి సయ్యద్ బర్కత్ అలీ, టిడిపి ప్రతినిధి కళ్యాడపు ఆగయ్య, బి.ఎస్.పి ప్రతినిధి సిరిసిల్ల అంజయ్య పాల్గొన్నారు.

Next Story