ప్రజావాణి ఫిర్యాదుపై అరగంటలోనే కలెక్టర్ స్పందన

by Taduka Kalyani |

ప్రజావాణిలో అందిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెంటనే స్పందించి సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పదో వార్డు చిన్న బోనాల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

ప్రజావాణి ఫిర్యాదుపై అరగంటలోనే కలెక్టర్ స్పందన
X

దిశ, రాజన్న సిరిసిల్ల : ప్రజావాణిలో అందిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెంటనే స్పందించి సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పదో వార్డు చిన్న బోనాల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు తాగునీటి సమస్యతో పాటు ఇతర వసతి సమస్యలపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, అరగంటలోనే పాఠశాలకు చేరుకున్న కలెక్టర్ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ముందుగా డైనింగ్ హాల్‌ను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా, ఆహారం నాణ్యత ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. బియ్యం, పప్పులు, కోడిగుడ్లు, నూనె తదితర ఆహార పదార్థాల నాణ్యత, గడువు తేదీలను పరిశీలించారు. అనంతరం హాస్టల్ గదులు, మరుగుదొడ్లు తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యాలయంలో తాగునీటి సరఫరా సమస్యను తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషాకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల వేములవాడ ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల తనిఖీలో గుర్తించిన లోపాల ఆధారంగా ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని చిన్న బోనాల గురుకుల ప్రిన్సిపాల్‌ను హెచ్చరించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడంతో పాటు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై కూడా ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.

Next Story