అంతుప‌ట్ట‌ని ఓట‌ర్ల‌ ర‌హ‌స్యం.. చివ‌రికీ గెలిచింది ఎవ‌రు..?

by Ratna Kumari |

రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు ఈసారి అభివృద్ధి, సిద్ధాంతాలు, పార్టీ గుర్తులు, అభ్యర్థుల మంచితనం ఏమాత్రం పని చేయలేదు.

అంతుప‌ట్ట‌ని ఓట‌ర్ల‌ ర‌హ‌స్యం.. చివ‌రికీ గెలిచింది ఎవ‌రు..?
X

దిశ, గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు ఈసారి అభివృద్ధి, సిద్ధాంతాలు, పార్టీ గుర్తులు, అభ్యర్థుల మంచితనం ఏమాత్రం పని చేయలేదు. ఎవరు ఎంత ఇచ్చారు అన్న ప్రశ్నలే ఓట్ల ఎజెండాగా మారింది. ఓటును అమ్ముకోకూడదు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకూడదు. అని ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా కూడా రామగుండంలో ఇవేమీ పనిచేయలేదు. ఓటు హక్కును మరిచి పెట్టుబడి లాభం లెక్కలే అభ్యర్థులు, ఓటర్ల ముందుకు వచ్చి ఓటు వేయించుకున్నారు. ఒక్కొక్క వార్డులో అభ్యర్థులు లక్షల నుంచి అరకోటి వరకు ఖర్చు చేశారు. శుక్రవారం ఎన్నికల ఫలితాలు వెలువడటంతో గెలిచినవారు సంబురాలు చేసుకుంటే, ఓడినవారు అప్పులే మిగిలాయని బాధపడుతున్నారు.

డబ్బే ఓట్లను నిర్ణయించింది

ఎన్నికల బరిలో దిగిన చాలా మంది అభ్యర్థులు ఒకే లక్ష్యంతో ముందుకు సాగారు. ఎట్లైనా గెలవాలి. పార్టీ గుర్తులు, సామాజిక సమీకరణలు, గత సేవలు అన్నీ పక్కనపెట్టి, ఓటర్లను నేరుగా సంప్రదించి నగదు పంచి ఓటర్లను ఆకర్షించుకొని, ఓటు బ్యాలెట్ బాక్స్ లో వేయించుకున్నారు. ప్రతి వార్డులో ఎంతమంది అభ్యర్థులు ఉంటే అంత మంది డబ్బును ఓటర్లకు పంచడం సర్వసాధారణమైనది. డబ్బు ఇచ్చినోడికే ఓటు అనే వాతావరణం రామగుండంలోని అన్ని వార్డులలో బలంగా వినబడుతుంది. అన్ని వార్డులలో బలపడింది. ఓటర్లు కూడా ఊరికే ఓటు ఎందుకు వేయాలని ఆలోచనలకు వచ్చారు. మాకేంది అని ప్రత్యక్షంగా అభ్యర్థులను అడిగారు... డ‌బ్బులు తీసుకున్నారు. కొన్ని వార్డులలో రూ.2000 నుంచి 5000 ఇచ్చిన అభ్యర్థులు కూడా ఉన్నారు. వార్డుల్లో కార్పొరేటర్ అభ్యర్థిగా గెలుపొందారు.

ఓటర్లు నోట్లకు అమ్ముడుపోయారా..?

ఓటర్లు నోట్లకు అమ్ముడుపోయారా.. మానవత్వం మరిచి ఓటర్లు నోట్లకు ఓట్లను అమ్ముకున్నారు. ఓటర్లు కూడా అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఓటు మాత్రం ఎవరికి వేయాలో వారికే వేశారు. డబ్బులు ఇయ్యని వారికి ఓటు వేయ‌మ‌ని ఓటర్లు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. కానీ చివరకు ఎవరికి ఓటు వేశారో ఎవరికి తెలియదు. ఇది ఒక రకంగా ఓటరు తెలివి తేటలని అనుకోవచ్చు. ప్రజాస్వామ్యం పై నమ్మకం తగ్గిందనే సంకేతం కూడా అనుకోవచ్చు. ఓటు ఒక సామాజిక బాధ్యత నుంచి ఒక రోజు లాభంగా మారింది. ఐదేళ్ల పాలనపై ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచించాల్సిన సమయం అని సామాజిక కార్యకర్తలు మొత్తుకున్న ఓటర్లు అదేమి పట్టనట్టు అభ్యర్థుల నుంచి డబ్బులను ముక్కు పిండి వసూలు చేసుకున్నారు.

మంచితనానికి, సేవకు విలువలేదు

మంచితనం, సేవలకు విలువ లేకపోవడం పార్టీ గుర్తు ఉన్నా, గతంలో సేవలు చేసినా, డబ్బుకే ఓటర్లు విలువనిచ్చారు. డబ్బు ఇవ్వని అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఇది సమాజంలో ఒక మార్పు అని భావించవచ్చు. మంచితనం, అభివృద్ధి, అజెండా కంటే ఒకరోజు తాగుడు, డబ్బు ప్రయోజనం ఓటర్లకు ముఖ్యమైంది. ఇలా అయితే రాజకీయాల భవిష్యత్ ఎటు వెళ్తుందో చూడాలి మరి.

అభ్యర్థులకు హెచ్చరిక

డబ్బు ఆధారంగా ఎన్నికలలో ఓట్లను కొనుగోలు చేస్తే చివరికి ఆ ప్రాంత అభివృద్ధి బలహీనపడుతుంది. ఎన్నికల ఖర్చు పెరిగితే, గెలిచిన తర్వాత ఆ డబ్బు తిరిగి ఎలా సంపాదించాలి అన్న ఆలోచన నాయకులలో మొదలవుతుంది. దాని ఫలితం అవినీతి, నాసిరకం కాంట్రాక్టులు, రాజకీయాలు, ప్రజల కోసం కేటాయించిన నిధుల దుర్వినియోగం జరుగుతాయి. రామగుండం కార్పొరేషన్ లో జరిగిన ఎన్నికలు ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఓటుకు విలువ కట్టుకొని అమ్ముకున్నారు. ఒక రోజు తీసుకున్న డబ్బు కంటే ఐదేళ్ల అభివృద్ధి గొప్పది కాదా అనే ప్రశ్న కొంతమందిలో మెదులుతోంది. ప్రాంతం బాగుపడాలంటే ఓటరు చైతన్యం అవసరం. అభ్యర్థుల నైతికత అవసరం. ఎన్నికలు ఒక పండగల జరుపుకుంటే తప్పులేదు. కానీ విలువలను కోల్పోకూడదు.

Next Story