- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను, పంట అవశేషాలను తగలబెట్టడం నిషేదం : కలెక్టర్ సత్య ప్రసాద్
బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను, పంట అవశేషాలను తగలబెట్టడం నిషేదం విధించినట్టు కలెక్టర్ సత్య ప్రసాద్ పేర్కొన్నారు.

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను, పంట అవశేషాలను తగలబెట్టడం నిషేదం విధించినట్టు కలెక్టర్ సత్య ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో పంట అవశేషాలు వ్యర్థాల గురించి మాట్లాడారు. జిల్లాలో వరి కోతలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు పంట అవశేషాలను ముఖ్యంగా వరి కొయ్యలను బహిరంగంగా కాల్చివేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్ సూచించారు. పంట అవశేషాల దహనం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు భూసారం తగ్గిపోతుందని, మానవ ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ కార్బన్, ఉపయోగకర సూక్ష్మజీవులు. వానపాములు నశించి భూమి సారవంతత క్షీణిస్తుందని పేర్కొన్నారు.
పంట అవశేషాల దహనం కారణంగా మంటలు అదుపు తప్పి సమీపంలోని ఆయిల్ పామ్ తోటలు, మామిడి తోటలు మరియు ఇతర పంట పొలాలకు వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు. దీనివల్ల రైతులు గణనీయమైన ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో పొడి వాతావరణ పరిస్థితుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించి సమీప వ్యవసాయ భూములను దెబ్బతీసే అవకాశం ఉన్నందున రైతులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పంట అవశేషాల దహనం వల్ల సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు. విద్యుత్ సరఫరా తీగలు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో పాటు ప్రజలు, రైతులు విద్యుత్ సిబ్బందికి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. ప్రజా ఆస్తుల రక్షణ దృష్ట్యా రైతులు పంట అవశేషాలను కాల్చకుండా ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను. పంట అవశేషాలను తగలబెట్టడం నిషేధించబడిందని తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పర్యావరణ పరిరక్షణ చట్టాల ప్రకారం రూ.5,000 నుండి రూ.25,000 వరకు జరిమానా విధించడంతో పాటు అవసరమైతే ఇతర చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.రైతులు పంట అవశేషాలను పొలంలోనే కలియదున్ని, సింగిల్ సూపర్ ఫాస్పేట్ (SSP) వంటి ఎరువులను వినియోగించడం ద్వారా వాటిని త్వరగా కుళ్లిపోయేలా చేసి సేంద్రియ ఎరువులుగా మార్చుకోవచ్చని సూచించారు. ఈ విధానం ద్వారా నేలలో పోషకాలు పెరిగి తదుపరి పంటలకు అధిక దిగుబడులు సాధించేందుకు దోహదపడుతుందని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పంట అవశేషాల శాస్త్రీయ నిర్వహణపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ, భూసార పరిరక్షణ, ప్రజారోగ్య పరిరక్షణతో పాటు సమీపంలోని ఆయిల్పామ్, మామిడి తోటలు, ఇతర పంటలు విద్యుత్ మౌలిక వసతులను అగ్ని ప్రమాదాల నుంచి కాపాడేందుకు పంట అవశేషాల దహనానికి పూర్తిగా దూరంగా ఉండాలని జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.






