- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ మార్క్ ‘ప్రజా వంచన’ పాలనపై బీఆర్ఎస్ నేతల నిప్పులు
ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి" అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.

దిశ, గంగాధర: "వచ్చే 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తాం.. తెలంగాణ గడ్డపై మళ్లీ గులాబీ జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి" అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలో గురువారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నేతృత్వంలో నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల అవగాహన సదస్సు, సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఎమ్మెల్సీ ఎల్. రమణ, సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇంచార్జ్ పన్యాల భూపతిరెడ్డిలతో కలిసి జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రేవంత్ రెడ్డిది ‘ప్రజా వంచన’ పాలన: జీవన్ రెడ్డి
సాధ్యం కాని అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఈ 30 నెలల కాలంలో ప్రజలను నమ్మించి గొంతు కోసిందని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. నాడు కేసీఆర్ అందించిన సుపరిపాలన ‘ప్రజాపాలన’ అయితే.. నేడు రేవంత్ రెడ్డి సాగిస్తున్నది కచ్చితంగా ‘ప్రజా వంచన’ పాలనేనని విమర్శించారు. రైతు భరోసా లేదు, పూర్తిస్థాయి రుణమాఫీ లేదు.. చివరికి కళ్యాణలక్ష్మి తులం బంగారం, మహాలక్ష్మి రూ.2500 ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్‌కు 10 కిలోల చొప్పున తూకంలో దోపిడీ జరుగుతుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చుందని, రాష్ట్రవ్యాప్తంగా రూ.2 వేల కోట్ల మేర పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కేవలం లారీలెక్కి ఫొటోలకు పోజులివ్వడం కాదని.. దమ్ముంటే ధర్మకాంట తూకం ప్రకారం రైతులకు పైసా నష్టం లేకుండా డబ్బులు ఇప్పించాలని సవాల్ విసిరారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం..
ఎమ్మెల్సీ ఎల్. రమణ కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తోందని ఎమ్మెల్సీ ఎల్. రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గులాబీ సైనికులను వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కేటీఆర్, హరీష్ రావుల టీమ్‌కు జీవన్ రెడ్డి తోడు కావడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ తిరుగులేని శక్తుగా మారిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను కాదని కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే.. ఇప్పుడు లోక్‌సభలో తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడే నాథుడే కరువయ్యాడని, కేంద్రం రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమ స్ఫూర్తితో సభ్యత్వ నమోదు
పన్యాల భూపతిరెడ్డి చొప్పదండి నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో లక్ష సభ్యత్వాలను పూర్తి చేసి, రాష్ట్రావ్యాప్తంగా నియోజకవర్గాన్ని నంబర్ వన్ స్థానంలో నిలపాలని ఇంచార్జ్ పన్యాల భూపతిరెడ్డి పిలుపునిచ్చారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో కేసీఆర్ సాధించిన తెలంగాణ చరిత్రను నేటి యువతకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. యాప్ పేరుతో రైతులకు యూరియా కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ దగా చేస్తోందని, మళ్లీ ప్రగతి పథం వైపు అడుగులు పడాలంటే బీఆర్ఎస్ రాక తప్పదన్నారు.
ఇంటింటికీ గులాబీ జెండా: మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
నియోజకవర్గంలోని ప్రతి ఇంటి తలుపు తట్టి అత్యధిక సభ్యత్వాలను నమోదు చేస్తామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. నాడు కాళేశ్వరం ప్రాజెక్టును ‘కూలేశ్వరం’ అని అవహేళన చేసిన సీఎం రేవంత్ రెడ్డికి.. ఇప్పుడు అదే ప్రాజెక్టు ద్వారా నీళ్లివ్వడం తప్ప మరో దారి లేకపోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు ‘నిర్మించడం’ తెలిస్తే రేవంత్‌కు ‘కూల్చడం’ మాత్రమే వచ్చన్నారు. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, గ్రామాల్లో "కేసీఆర్ రావాలి.. రేవంత్ పోవాలి" అనే నినాదాలు మార్మోగుతున్నాయన్నారు. గతంలో తాను ఎన్నో ఇబ్బందులున్నా రూ.1800 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ భారీ బహిరంగ సదస్సులో చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వివిధ విభాగాల ప్రతినిధులు, సోషల్ మీడియా వారియర్స్ మరియు వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.






