​కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ సమరభేరి..!

by Ratna Kumari |

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం హుజురాబాద్ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

​కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ సమరభేరి..!
X

దిశ,​ హుజురాబాద్ రూరల్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం హుజురాబాద్ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు తుర్పాటి రాజు నాయకత్వంలో కార్యకర్తలు ఎంఆర్ ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు తుర్పాటి రాజు మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ప్రజలకు అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, గద్దెనెక్కిన తర్వాత వాటిని విస్మరించిందని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ఊసే లేదని ధ్వజమెత్తారు. సమయానికి పెట్టుబడి సాయం అందక రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని విమర్శించారు.

కళ్యాణ లక్ష్మి, గృహ నిర్మాణ పథకం (ఇందిరమ్మ ఇళ్లు) వంటి పథకాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. హుజురాబాద్ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వాన్నంగా తయారైందని, వీధి దీపాలు, మౌలిక సదుపాయాల కల్పనలో మున్సిపల్ యంత్రాంగం విఫలమైందని నేతలు ఆరోపించారు. ముఖ్యంగా స్థానికంగా డంపింగ్ యార్డు ఏర్పాటు ప్రతిపాదనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రెండో విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, మాజీ పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు, సీనియర్ నాయకులు నరాల రాజశేఖర్, కొలిపాక శ్రీనివాస్, తిప్పబతిని రాజు, యాంసాని శశిధర్, కౌన్సిలర్ కొలుగురి సుమలత, లక్ష్మీ దుర్గ, అనురాగ్, రోహిత్, గొట్టే రవి, బోరగాల సారయ్య, కొలిపాక వెంకటేష్, ఎర్ర శ్రీధర్, మోటపోతుల రాకేష్, క్యాస వెంకటేష్, అయిత సందీప్, రాపాక రాజు, నల్ల అజయ్, గరిగే శివకృష్ణ, తూర్పాటి రాజశేఖర్, సురేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story