బిల్లులు మంజూరు కాక.. మాజీ సర్పంచులు అవస్థలు

by Yella Dhawani Reddy |

హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామ సర్పంచ్ బింగి కరుణాకర్ తన పదవి కాలంలో పలు అభివృద్ధి పనులు చేయగా అందుకు సంబంధించి రూ.23 లక్షల బిల్లులు ప్రభుత్వ నుంచి మంజూరు కావాల్సి ఉంది.

బిల్లులు మంజూరు కాక.. మాజీ సర్పంచులు అవస్థలు
X

దిశ, హుజురాబాద్ రూరల్: హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామ సర్పంచ్ బింగి కరుణాకర్ తన పదవి కాలంలో పలు అభివృద్ధి పనులు చేయగా అందుకు సంబంధించి రూ.23 లక్షల బిల్లులు ప్రభుత్వ నుంచి మంజూరు కావాల్సి ఉంది. అలాగే రాంచంద్రపూర్ గ్రామ సర్పంచ్ రేగుల సుమలత అశోక్ చేసిన పనులకు సంబంధించి రూ.20 లక్షల బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. వారి పదవీ కాలం ముగిసిపోయి ఏడాదన్నర కాలం కావస్తున్న ఇప్పటికీ బిల్లులు మాత్రం రాలేదు. దీంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బిల్లులు మంజూరు కాకపోవడంతో మాజీ సర్పంచులు మానసిక వేదనకు గురవుతున్నారు.

ఇంకా పెండింగ్​లోనే బిల్లులు

​హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ సర్పంచులు చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన దాదాపు రూ.25 కోట్లు బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఫిబ్రవరి 2024లో సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటికీ, అంతకు ముందు నుంచే వారికి చెల్లించాల్సిన నిధులు నిలిచిపోయాయి.​గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు ఏడాది పాటు బిల్లుల చెల్లింపులో జాప్యం చేసింది. ఆ సమయంలో ఎక్కువమంది సర్పంచులు అదే పార్టీకి చెందినవారు కావడంతో, వారు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, మాజీ సర్పంచుల బిల్లుల సమస్యకు ఇప్పటికీ పరిష్కారం లభించడం లేదు.

​15వ ఆర్థిక సంఘం, ఎస్‌ఎఫ్‌సీ నిధులకు సంబంధించిన బిల్లులు చేసి చెక్కులు ట్రెజరీలో వేసినప్పటికీ, చెల్లింపులు ఆగిపోయాయి. తమ బిల్లుల కోసం మాజీ సర్పంచులు అనేకసార్లు సచివాలయం, అసెంబ్లీని ముట్టడించడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని ముందస్తు అరెస్టులతో అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో, గత ప్రభుత్వంలో ప్రశ్నించని నాయకులు ఇప్పుడు ఆందోళన చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ముడుపులు ఇస్తామంటే..

బిల్లులకు సంబంధించి పలువురికి టోకెన్లను ఆర్థిక శాఖ జారీ చేసినట్లు తెలిసింది. కాగా బిల్లుల చెల్లింపులు మొత్తం హైదరాబాదు నుంచి పెండింగ్​లో ఉండడంతో ఒక్కో బిల్లుకు 15 శాతం వరకు ముడుపులు ఇస్తామని ఉద్యోగులను కొందరు మాజీ సర్పంచులు ప్రలోభ పెడుతున్నట్టు తెలిసింది. కానీ మాజీ సర్పంచులు తమ బిల్లుల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా నిరీక్షించక తప్పదని తెలుస్తుంది.

ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం..

బింగి కరుణాకర్, మాజీ సర్పంచ్.

ప్రజలు మాపై నమ్మకంతో సర్పంచులుగా ఎన్నుకున్నారు. వారికి సౌకర్యాలను కల్పించడానికి అభివృద్ధి పనులకు సొంత డబ్బులతో పాటు అప్పులు తెచ్చి పనులు పూర్తి చేశాం. లక్షల్లో అప్పు తెచ్చి వడ్డి చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం.

ఆస్తులు అమ్ముకున్నాం..

రేగుల సుమలత అశోక్, మాజీ సర్పంచ్,

సర్పంచులుగా పనిచేసిన పాపానికి ఆస్తులు అమ్ముకున్నాం. లక్షల్లో బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. వడ్డీ భారంతో ఎంతోమంది అవస్థలు పడుతున్నారు. కొందరు మాజీ సర్పంచులు దిగులుతో మరణించిన విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.

Next Story