- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణిలో "కారుణ్యం" కనుమరుగవ్వనుందా?
సింగరేణిలో కారుణ్య నియామకాలు కనుమరుగవుతాయని ప్రచారం జోరందుకుంది.

దిశ, యైటింక్లయిన్ కాలనీ: సింగరేణిలో కారుణ్య నియామకాలు కనుమరుగవుతాయని ప్రచారం జోరందుకుంది. సింగరేణి వ్యాప్తంగా గత మార్చి నెల నుంచి మెడికల్ బోర్డు నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది. మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన కార్మికుల వారసులకు ఉద్యోగ నియామకాల్లో సైతం సింగరేణి యాజమాన్యం తీవ్ర జాప్యం చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగరేణి వ్యాప్తంగా పలు భూగర్భబావులు, ఓపెన్ కాస్ట్‌లు మూతపడడంతో కార్మికులు అధికమయ్యారనే నెపంతో కారుణ్య నియామకాల్లో యాజమాన్యం జాప్యం చేస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మైన్స్ మూతపడడం.. నూతన ప్రాజెక్టులు రాకపోవడం..సింగరేణికి సవాల్‌గా మారింది. కొత్త ప్రాజెక్టుల కోసం యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. పలు నిబంధనలు సింగరేణికి తలనొప్పిగా మారాయి. మెడికల్ బోర్డులో సైతం పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే నెపంతో ఏసీబీ దాడులు కొనసాగడం.. పలువురు అధికారులు, కార్మిక సంఘాల నాయకులను విచారించడం జరిగింది. దీంతో గతంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా పని చేసిన సుజాత పదవీ విరమణ చేసిన దగ్గర నుంచి మెడికల్ బోర్డు ఏర్పాటు చేయడంలో యాజమాన్యం వెనుకంజ వేస్తోంది. ఫలితంగా కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించేందుకు మెడిక ల్ బోర్డుకు పెట్టిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గత మార్చి నెల నుంచి మెడికల్ బోర్డు నిలిచిపోవడంతో సింగరేణి వ్యాప్తంగా వందలాది మంది కార్మికులు మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే మెడికల్ అన్ ఫిట్ అయిన కార్మికుల వారసులకు అన్ని రకాల పరీక్షలు ఇంటర్వ్యూలు పూర్తి అయినప్పటికీ ఉద్యోగ నియామకాల్లో జాప్యం కొనసాగుతోంది. సింగరేణి వ్యాప్తంగా సుమారు 270 మంది వరకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెల కొంది. ఉద్యోగాల భర్తీ విషయంలో జాప్యం జరగడానికి సింగరేణిలో కార్మికులు అధికంగా ఉండడమే ప్రధాన కారణమని ప్రచారం సాగుతోంది. సింగరేణి పరిధిలోని శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్ కె. 5 ఇంక్లెన్, ఇల్లందు ఏరియా లోని జెకె 5 ఇంక్లైన్ మూతపడడం వల్ల సుమారు రెండు వేల మందికి పైగా కార్మికులు సర్ప్లస్(మిగులు ) అయినట్లు అధికారులు ప్రకటిస్తున్నారు. దీంతో ఉన్న కార్మికులనే సర్దుబాటు చేయడానికి చర్యలు చేపడుతున్నారు. ఇల్లందు ఏరియా నుంచి ఇతర ప్రాంతాలకు కార్మికులను బదిలీ చేయడం..ఇందుకు కార్మిక సంఘాలు అడ్డుపడడం.. అధికార పార్టీల నాయకుల ఒత్తిడితో కొందరు కార్మికులకు పనులు లేనప్పటికీ స్థానికంగానే సర్దుబాటు చేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొత్తగూడెం ఏరియాలోని గౌతంఖని ఓపెన్ కాస్ట్ మూతపడడం వల్ల కార్మికులను సత్తుపల్లి కిష్టారం ఓసీలకు డిప్యూటేషన్ చేశారు. ఉన్న కార్మికులను సర్దుబాటు చేయడం కష్టతరం కావడంతో కారుణ్య నియామకాలు చేయడానికి యాజమాన్యం వెనుకంజ వేస్తోంది.
ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం భవిష్యత్తులో నూతన బొగ్గు బ్లాకుల వేలంపాటలో పాల్గొనేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో నూతన బొగ్గుబ్లాకులు వస్తేనే ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కారుణ్య నియామకాలు జరపడం యాజమాన్యానికి తలకు మించిన భారమవుతోంది. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందిన యువకులు సైతం విధులకు డుమ్మా కొడుతున్నారు. అధిక శాతం మంది కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో గైర్హాజరు శాతాన్ని తగ్గించేందుకు యాజమాన్యం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కార్మికుల కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ.. ఆశించిన ఫలితాలు రావడం లేదని పలువురు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కార్మికుల గైర్హాజరు సైతం కారుణ్య నియామకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు సుమారు రెండువేల మందికి పైగా 60 మస్టర్లు చేయడం గమనార్హం. కొందరు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం పొంది ఇతర సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేస్తూ అప్పుడుప్పుడు సింగరేణిలో విధులకు హాజరవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే విజిలెన్స్ విభాగం గైర్హాజరుకు సంబంధించిన కారణాలపై విచారణ కొనసాగిస్తోంది. ఏది ఏమైనా సింగరేణిలో కారుణ్య నియామకాలు కనుమరుగవుతాయన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
2018 నుండి ప్రారంభమైన 'కారుణ్యం'
సింగరేణిలో 2018 మార్చి నుంచి మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా కారుణ్య నియామక ప్రక్రియ ప్రారంభమై కొనసాగుతోంది. యాజమాన్యం కొత్తగూడెంలోని ప్రధాన ఆస్పతిలో ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహిస్తోంది. కొన్ని సందర్భాల్లో ఒక్కో నెలలో రెండు మెడికల్ బోర్డులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. దాదాపు 116 మెడికల్ బోర్డులు నిర్వహించారు. వీటిద్వారా సుమారు 16వేల మందికిపైగా కార్మిక వారసులు ఉద్యోగాల్లో చేరారు. అయితే ఏడు నెలలుగా మెడికల్ బోర్డు నిలిచిపోయింది. దీంతో వ్యాధుల బారిన పడిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అనారోగ్యం కారణంగా డ్యూటీలు చేయలేకపోతున్న కార్మికులు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారిని ప్రతీ నెల బోర్డుకు పిలిచి స్క్రీనింగ్ చేస్తారు. వారి డిజిగ్నేషన్, జబ్బు తీవ్రతను బట్టి అన్ఫిట్ (ఇన్వాలిడేషన్) చేయడమో, అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్ కు
లేదా హయ్యర్ సెంటర్ రెఫరల్ అని ఇస్తారు. కంపెనీలో ఇంతటి ప్రాముఖ్యత ఉన్న మెడికల్ బోర్డును చివరిసారిగా ఈ ఏడాది మార్చి 21న నిర్వహించారు. అప్పటి నుంచి రెగ్యులర్ బోర్డు నిర్వహించలేదు. కానీ హయ్యర్ సెంటర్ రెఫరల్ కేసులకు మాత్రం జూలై 30, 31వ తేదీల్లో మెడికల్ బోర్డు నిర్వహించారు. వారు కూడా అప్పటికే నెలల తరబడి నిరీక్షించారు. మొత్తంగా 55 మందిని బోర్డుకు పిలువగా వారిలో 54మంది హాజరయ్యారు. వీరిలో ఐదుగురిని మాత్రమే అనిఫిట్ చేసి మిగితా వారిని డ్యూటీలు చేసుకోవాలని సూచించారు. కారుణ్య నియామకాలు అమలు తర్వాత నుండి ఇంత తక్కువ సంఖ్యలో ఆన్ ఫిట్ కావడం మొదటిసారి. ఇదే తీరు రెగ్యులర్ మెడికల్ బోర్డు లో సైతం కొనసాగుతుందని కోల్ బెల్ట్ లో జోరుగా చర్చ జరుగుతుంది.
నిరీక్షణావస్థతో ఆవేదనలో కార్మికులు
రెండేళ్ల సర్వీసు మిగిలిన కార్మికులు ఎక్కువ శాతం మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంటారు. వీరితోపాటు గనుల్లో, బయట జరిగిన ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారు కూడా బోర్డుకు దరఖాస్తులు అందజేస్తుంటారు. వీరందరిని ప్రతీ నెల చివరిలో బోర్డుకు పిలిచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏడు నెలలుగా బోర్డు నిలిచిపోవడంతో సింగరేణి వ్యాప్తంగా సుమారు వెయ్యి మంది కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జబ్బు కారణంగా కొందరు డ్యూటీలు కూడా సక్రమంగా చేయడం లేదు. బోర్డు నిర్వహించి ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం వల్ల వేతన నష్టం చవిచూడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికే పైరవీ ఆరోపణలతో అభాసుపాలవుతున్న మెడికల్ బోర్డు నేడు జాప్యం వల్ల మరిన్ని విమర్శలు ఎదుర్కొంటోంది. మెడికల్ బోర్డు జాప్యంతో కారుణ్య నియామకాలు పొందే డిపెండెంట్ల సర్వీసు లాస్ అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మౌనం వీడని గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు
మెడికల్ బోర్డు నిలిచిపోవడానికి గల కారణాలపై గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు ఎలాంటి క్లారిటీ ఇవ్వడంలేదు. జూలై చివరి వారంలో నిర్వహించిన హయ్యర్ సెంటర్ మెడికల్ బోర్డులో 55 మందిని ఆహ్వానించగా ఒకరు గైర్హాజరయ్యారు. మిగతా వారిలో ఐదుగురినే మెడికల్ ఇన్వాలిడేషన్ చేశారు. మిగతా వారిని సేమ్ జాబ్, మరికొందరిని అండర్ గ్రౌండ్ నుంచి ఉపరితలనానికి కేటాయించారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న కార్మికులను కూడా ఫిట్ఫర్ సర్ఫేస్ ఇవ్వడంతో కార్మిక కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఇంత జరుగుతున్నా మెడికల్ బోర్డు వ్యవహారం పై గెలిచిన సంఘాల నాయకులు మౌనం వహిస్తుండటంతో కారుణ్య నియామకాలుకు కధ కంచికే అన్నట్లు ప్రచారం జోరందుకుంది.






