ఏసీబీ వలలో మరో అవినీతి చేప

by Ajay Maddhiboyina |

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఏసీబీ రమణామూర్తి ఆధ్వర్యంలో తన బృందం విస్తృతస్థాయి దాడులు నిర్వహిస్తోంది.

ఏసీబీ వలలో మరో అవినీతి చేప
X

దిశ, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఏసీబీ రమణామూర్తి ఆధ్వర్యంలో తన బృందం విస్తృతస్థాయి దాడులు నిర్వహిస్తోంది. కాగా శనివారం ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో కార్యాలయంలో సర్వేయర్ గా విధులు నిర్వర్తిస్తున్న నాగరాజు రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. జిల్లాలో ఇటీవల కాలంలో పలు కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో బాధితుల నుంచి ఫిర్యాదు వచ్చిన వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. తాజాగా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ ఓ రైతు భూమి కొలతల పంచనామ ధ్రువీకరణ పత్రం విషయంలో శనివారం జిల్లా కేంద్రంలో రూ.15 వేలు లంచం తీసుకుంటున్న నాగరాజును డీఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో పట్టుకున్నారు. విధుల్లో ఆఖరి రోజు కూడా ఒక అవినీతి అధికారి భరతం పట్టడం, తన కెరీర్ లో డీఎస్పీ రమణమూర్తి మొక్కవోని ధైర్యంతో చేసిన దాడులపై జిల్లా ప్రజలే కాకుండా ఉమ్మడి జిల్లా ప్రజలు ప్రశంసలజల్లులు కురిపిస్తున్నారు. కాగా ఇటీవల నీటిపారుదల శాఖ అధికారి అమరేందర్ రెడ్డి కూడా ఏసీబీ వలలో పడడం జిల్లాలో కలకలం రేపింది.

దిశ, రాజన్న సిరిసిల్ల, ఎల్లారెడ్డిపే : సిరిసిల్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో కార్యాలయంలో సర్వేయర్ గా విధులు నిర్వర్తిస్తున్న నాగరాజు రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జక్కాపురం మల్లేశం అనే రైతు భూమి కొలతల పంచనామా ధ్రువీకరణ పత్రం జారీ కోసం నాగరాజు లక్ష రూపాయలు డిమాండ్ చేయగా రూ.80 వేలకు డీల్ కుదిరింది. అయితే మల్లేశం గతంలో భూ సర్వే చేసేందుకు రూ.22 వేలు నాగరాజుకు ఇచ్చాడు. కాగా నాగరాజు సర్వే చేసిన పంచనామా ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వడానికి మిగతా డబ్బులు అడిగాడు. ఈ క్రమంలో శనివారం చంద్రంపేట రైతు వేదిక ఆవరణలో మరో రూ.15 వేలు మల్లేశం వద్ద తీసుకుంటుండగా నాగరాజును అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం అనంతరం అతన్ని అధికారులు ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో కార్యాలయానికి తరలించి విచారణ జరిపారు. అనంతరం కరీంనగర్ ఏసీబీ కోర్టులో నాగరాజును హాజరు పరిచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.

అందుబాటులో ఉండని సర్వేయర్

సిద్దిపేట జిల్లా నుంచి గత ఏడాది జూన్ మాసంలో ఎల్లారెడ్డిపేట సర్వేయర్ గా బాధ్యతలు చేపట్టిన నాగరాజు నిత్యం కార్యాలయంలో అందుబాటులో ఉండేవాడు కాదని విమర్శలున్నాయి. అంతేకాకుండా భూ కొలతల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి వారి దగ్గర లంచం డిమాండ్ చేసేవాడనే ఆరోపణలు లేకపోలేదు. గత కొద్ది కాలంగా నాగరాజుపై ఏసీబీ అధికారులు కన్ను వేసి ఉంచినట్లు సమాచారం. గతంలో ఎల్లారెడ్డిపేట మండల ఎమ్మార్వో ఆఫీస్ పలు వివాదాలకు కేంద్రంగా ఉండేది. కానీ ఇటీవల తహసీల్దారుగా డి.సుజాత బాధ్యతలు చేపట్టిన అనంతరం సిబ్బందిని గాడిలో పెట్టినట్లు చర్చ జరుగుతోంది. కాగా ఇప్పుడు సర్వేయర్ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుపడడం మండలంలో కలకలం రేపుతోంది.

పదవీ విరమణ రోజే వల

ఇదిలా ఉండగా శనివారం సిరిసిల్లలో జరిగిన ఏసీబీ దాడులు అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగాయి. అయితే అదే రోజున రమణమూర్తి ఏసీబీ డీఎస్పీగా పదవీ విరమణ పొందారు. అవినీతి నిరోధక శాఖలో మంచి సమయస్ఫూర్తితో చాకచక్యంగా వ్యవహరించే అధికారిగా రమణమూర్తికి మంచి పేరుంది. ఆయన తన బృందంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నో ఏసీబీ దాడులు నిర్వహించి ఎంతోమంది ప్రభుత్వ అవినీతి అధికారులను పట్టుకున్నారు. ఆయన పేరు చెబితేనే అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయంటే అతిశయోక్తి కాదు. ఆయన విధుల్లో చివరి రోజు కూడా ఓ అవినీతి అధికారి భరతం పట్టడం పట్ల మేధావివర్గం హార్షం వ్యక్తం చేస్తోంది. ఆయన పనితీరును ప్రభుత్వ ఉద్యోగులు ఆదర్శంగా తీసుకోవాలని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story