- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీచర్ గుడికి - భర్త బడికి
అంగన్‌వాడీ కేంద్రాల్లో పర్యవేక్షణ లోపించి టీచర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. కొత్తగట్టు గ్రామంలో అంగన్‌వాడీ టీచర్ భారతి పసిపిల్లలను గాలికి వదిలేసింది.

దిశ, శంకరపట్నం : మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పర్యవేక్షణ లోపించి టీచర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. కొత్తగట్టు గ్రామంలోని అంగన్వాడి సెంటర్ 1లో టీచర్ భారతి పసిపిల్లలను గాలికి వదిలేసి, తన భర్తను సెంటర్‌లో కాపలా పెట్టి మరీ గుట్టపై దైవ దర్శనానికి వెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయంపై ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మను వివరణ కోరగా, భర్తను తోడుగా ఉంచి వెళ్లమని తానే అనుమతి ఇచ్చానని చెప్పడం విస్మయానికి గురిచేసింది. లింగాపూర్ గ్రామంలోని కేంద్రాలు నియమ నిబంధనలకు విరుద్ధంగా మధ్యాహ్నం రెండు గంటలకే తాళాలు వేసి మూసివేస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఆధ్యాత్మిక సేవలో మునిగి తేలుతున్న టీచర్లపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల అండదండలతోనే అంగన్‌వాడీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పసిపిల్లల ఆలనాపాలనా చూడాల్సిన అంగన్‌వాడీ టీచర్లు విధులకు ఎగనామం పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు, లింగాపూర్ గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో టీచర్లు తమ వ్యక్తిగత పనుల కోసం పిల్లల సంరక్షణను గాలికి వదిలేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
భర్తను కాపలా పెట్టి.. హుండీ లెక్కింపునకు!
కొత్తగట్టు గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్-1 టీచర్ భారతి, విధుల్లో ఉండాల్సిన సమయంలో కొత్తగట్టు గుట్టపై దైవదర్శనం, హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై వివరణ కోరగా, తన భర్తను సెంటర్‌లో కాపలా పెట్టి, సూపర్వైజర్ అనుమతితోనే వచ్చానని చెప్పడం విస్మయానికి గురిచేసింది. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు టీచర్ గుడిలోనే గడపడంతో, సెంటర్‌లోని పిల్లలను పట్టించుకునేవారు లేక వారు నీరసించి నిద్రపోయారు. దీనిపై ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మను వివరణ కోరగా, భర్తను కాపలా ఉంచి వెళ్లమని తానే చెప్పినట్లు వింత సమాధానం ఇవ్వడం గమనార్హం.
మధ్యాహ్నానికే మూతపడుతున్న కేంద్రాలు
మండలంలోని లింగాపూర్ గ్రామంలో అంగన్‌వాడీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నిబంధనల ప్రకారం సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాలు నడవాల్సి ఉండగా, 1 మరియు 2వ సెంటర్ల టీచర్లు, ఆయాలు మధ్యాహ్నం 2 గంటలకే తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే వీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. విధు పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని విధుల నుండి తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
మాకు చెప్పే హుండీ లెక్కింపునకు వెళ్లింది : పద్మ, ఐసీడీఎస్ సూపర్ వైజర్
అంగన్వాడీ టీచర్ భారతి గుడిలో హుండి లెక్కింపునకు వెళ్తానని కోరగా భర్తను స్కూల్ వద్ద ఉంచి వెళ్లమని మేమే చెప్పాం. అందులో తప్పు ఏమి ఉంది. తనకు బదులుగా తన భర్తను పెట్టింది.






