అంధ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తాం.. మంత్రి లక్ష్మణ్ కుమార్

by Bhanu |

రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అంధ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.

అంధ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తాం.. మంత్రి లక్ష్మణ్ కుమార్
X

దిశ, కరీంనగర్ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అంధ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి హోదాలో ఆయన శనివారం కరీంనగర్‌లో హెలెన్ కేలర్ 145వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. టీఎన్జీవో ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన మంత్రి, అంధ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల వ్యవహారాల్లో ఐరిష్, బయోమెట్రిక్ విధానాల నుంచి అంధ ఉద్యోగులను మినహాయించాలని ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షల్లో వారికి మార్కుల రాయితీ, బదిలీల్లో అభ్యర్థన మేరకు ప్రత్యేక సౌకర్యం కల్పించే దిశగా పరిశీలన చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు రిజర్వేషన్ల అమలు, ఆర్టీసీ బస్సుల్లో అంధులకు ఉచిత ప్రయాణం వంటి అంశాలపై సమస్యల వారీగా పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీఓ మహేష్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ సహా వివిధ జిల్లాల నుంచి వచ్చిన అంధ ఉద్యోగులు పాల్గొన్నారు.


Next Story