వరకట్న వేధింపులు.. ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య..

by Bhanu |

వరకట్న వేధింపులు.. ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య..
X

దిశ, తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ గ్రామంలో ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పిట్టల రాములుకు కూతురు స్వప్నను పదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన గూల్ల వెంకటేష్‌తో వివాహం జరిపారు. పెళ్లి సమయంలో పదితులాల బంగారం, రూ.5 లక్షల వరకట్నం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే వివాహం జరిగిన మొదటి సంవత్సరం నుంచే భర్త వెంకటేష్, అత్త భూలక్ష్మి, మామ నర్సయ్య, ఇతర బంధువులు అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతూ వచ్చినట్టు మృతురాలి తల్లి అనసూర్య పేర్కొన్నారు.


ఈ నేపథ్యంలో గ్రామస్థాయి పంచాయతీలు కూడా జరిగినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో బుధవారం స్వప్న తన అత్తగారి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని ఘర్షణకు దిగారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితిని ఎదుర్కొన్న పోలీసులు ఇరుపక్షాలను శాంతపరిచారు. అనంతరం స్వప్న మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్తారింటి వేధింపుల కారణంగానే స్వప్న ఈ చింతాజనకమైన నిర్ణయం తీసుకుందని అనసూర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story