విద్యతోపాటు నైపుణ్యం తప్పనిసరి : విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా

by Ratna Kumari |

ప్ర‌స్తుతం విద్య‌తో పాటు వివిధ ర‌కాల నైపుణ్యాలు ఎంతో ముఖ్యమ‌ని.. అప్పుడే ఉపాధి మార్గాలు ల‌భిస్తాయ‌ని విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి యోగితారాణా పేర్కొన్నారు.

విద్యతోపాటు నైపుణ్యం తప్పనిసరి :  విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : ప్ర‌స్తుతం విద్య‌తో పాటు వివిధ ర‌కాల నైపుణ్యాలు ఎంతో ముఖ్యమ‌ని.. అప్పుడే ఉపాధి మార్గాలు ల‌భిస్తాయ‌ని విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి యోగితారాణా పేర్కొన్నారు. శాతవాహన యూనివర్సిటీలో జరిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు "అకాడమిక్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం" కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేనా, కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగితా రాణా మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో మార్కులతో పని లేదని, మంచి స్కిల్స్ కనబరిచిన వారే రాణించగలరని అన్నారు. రాష్ట్రంలోని ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో "అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్" (ఏ.ఈ.డి.పీ) కోర్సుల ద్వారా విద్యార్థులకు చదువుతోపాటు వృత్తివిద్య, నైపుణ్య రంగాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది 1200 మంది ఈ శిక్షణ పూర్తి చేసుకొని, పలు రంగాల్లో స్థిరపడ్డారని తెలిపారు. ఈ ఏడాది 8 వేల మంది విద్యార్థులకు ఈ శిక్షణకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ఏఈడీబీ కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. ఏఈడీపీ పై అధ్యాపకులకు త్వరలో శిక్షణ ఏర్పాటు చేస్తామని అన్నారు. కళాశాల ప్రిన్సిపాళ్లు విద్యార్థులను ప్రోత్సహించి ఏఈడీపీ కార్యక్రమంలో 100 శాతం సీట్లను నింపాలని కోరారు.

ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేనా మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పదని, విద్యార్థులు పలు రంగాల్లో శక్తి సామర్థ్యాలు చాటేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. కళాశాలల నుంచి విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్యాలను నేర్చుకుని వెళ్లాలని తెలిపారు. ఏఈడీపీ ద్వారా శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాల విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్యం నేర్చుకొని భవిష్యత్తులో స్థిరపడడానికి ఏఈ డిపి ఒక మంచి వేదిక అని అన్నారు. శాతవాహన యూనివర్సిటీ సహకారంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వివిధ రంగాల్లో శిక్షణ పొందాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎంతగానో ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రతి విద్యార్థి తమలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి ఈ శిక్షణల ద్వారా మరింత పట్టు సాధించాలని సూచించారు. శాతవాహన వైస్ ఛాన్సిలర్ యు.ఉమేష్ కుమార్ మాట్లాడుతూ ఏ ఈ డి పి కార్యక్రమాలపై యూనివర్సిటీ పరిధిలోని కళాశాల ప్రిన్సిపాళ్లతో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. తద్వారా అనేక మంది విద్యార్థులకు ఏఈడిపి కార్యక్రమం ద్వారా శిక్షణలు ఇప్పించి తీర్చిదిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, శాతవాహన రిజిస్ట్రార్ సతీష్ కుమార్ పాల్గొన్నారు.

Next Story