కేంద్రీయ విద్యాలయానికి నర్సింగాపూర్‌లో స్థలం కేటాయింపు

by Ratna Kumari |

జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి నర్సింగాపూర్‌లో స్థలం కేటాయిస్తున్నట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

కేంద్రీయ విద్యాలయానికి నర్సింగాపూర్‌లో స్థలం కేటాయింపు
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి నర్సింగాపూర్‌లో స్థలం కేటాయిస్తున్నట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి నర్సింగాపూర్ శివారులోని సర్వే నెంబర్ 437లో ప్రతిపాదిత స్థలాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగిత్యాలను ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. కేంద్రీయ విద్యాలయం కోసం ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఐటీఐ, ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేశామని అన్నారు. భూమి ప్రతిపాదనలు కేంద్రీయ విద్యాలయ అధికారులకు పంపిస్తున్నట్లు తెలిపారు.


అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల -కరీంనగర్ హైవేకు 500 మీటర్ల లోపే స్థలం కేటాయిస్తున్నామని, రోడ్డు ఇతర అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. చల్‌గల్‌ వాలంతరి సెంటర్ లో నాచురల్ ఫార్మింగ్ పరిశోధనల అవసరాల దృష్ట్యా అక్కడ రెండు ఎకరాలకు మించి భూమి కేటాయించే అవకాశం లేకపోవడంతోనే నర్సింగాపూర్‌లో స్థలం కేటాయిస్తున్నట్టు వివరించారు. కేంద్రీయ విద్యాలయం మంజూరుకు కృషి చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరిశీలనలో జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీవో మధుసూదన్, ప‌లువురు అధికారులు, సర్పంచ్ వంశీ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story