పన్నుల మోత.. మున్సిపాలిటీలో సామాన్యులపై అదనపు భారం

by Ajay Maddhiboyina |

చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా పన్నుల విధింపు చర్యలు పట్టణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేపుతున్నాయి. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ కోసం నెలవారీగా రూ.50 వసూలు చేయాలని పాలకవర్గం తీర్మానించింది.

పన్నుల మోత.. మున్సిపాలిటీలో సామాన్యులపై అదనపు భారం
X

చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా పన్నుల విధింపు చర్యలు పట్టణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేపుతున్నాయి. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ కోసం నెలవారీగా రూ.50 వసూలు చేయాలని పాలకవర్గం తీర్మానించింది. మున్సిపాలిటీ విధించే అదనపు పన్నులు సామాన్యుడి నడ్డి విరిచేలా ఉన్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పట్టణ సీనియర్ సిటిజన్లు, ప్రజలు కలిసి ఒక ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేశారు. చైర్ పర్సన్ వడ్లూరి సరిత, కమిషనర్ నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో సిబ్బంది జీతాల కోసమే ఈ పన్నులని తెలుపడం గమనార్హం. ప్రజలపై భారం వేయకుండా సౌర విద్యుత్, వాటర్ ప్లాంట్లు, ప్రకటనల బోర్డుల ద్వారా ఆదాయం పెంచుకోవాలని సమితి సూచించింది. ప్రజల తరపున గళం వినిపించాల్సిన బీజేపీ కౌన్సిలర్లు ఈ కీలక సమావేశానికి గైర్హాజరు కావడంపై విమర్శలు వస్తున్నాయి.

- దిశ, చొప్పదండి

దిశ, చొప్పదండి : చొప్పదండి మున్సిపాలిటీ పట్టణ ప్రజలపై చెత్త సేకరణ, దుకాణాలకు పన్నులు మోపడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ విధించే పన్నులతో సామాన్యుడి నడ్డి విరిచేలా ఉండడంతో ప్రజలు మున్సిపాలిటీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో తమ సమస్యలకు నూతన పాలకవర్గం పరిష్కారం చూపుతుందని భావిస్తే, అందుకు భిన్నంగా ప్రజలపై అదనపు పన్నులు విధించేలా మున్సిపాలిటీ ప్రణాళికలు చేయడంపై పట్టణ ప్రజల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇటీవల మున్సిపాలిటీ పాలకవర్గం చెత్త సేకరణకు రూ.50 చొప్పున పన్నులు విధించేందుకు ఆమోదించింది. ఈ అంశంపై పట్టణ సీనియర్ సిటిజన్స్, ప్రజలు ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇతర మార్గాలు అన్వేషించి ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని, ప్రజలపై పన్నుల భారం మోపడం తగదని ముక్తకంఠంతో వ్యతిరేకించారు.

ఆదాయం పెంపుపై దృష్టి...

ఈ నేపథ్యంలో పాలకవర్గం మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నాగరాజు ఆధ్వర్యంలో చైర్ పర్సన్ వడ్లూరి సరిత అధ్యక్షతన కౌన్సిలర్లు, ఐక్య కార్యాచరణ కమిటీ, సీనియర్ సిటిజన్లతో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీకి ఆదాయం లేక ఉద్యోగులకు, సిబ్బందికి జీతాలు చెల్లించలేని సందర్భంలోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పన్నులు విధించడం కోసం పాలకవర్గం చేసిన తీర్మానాన్ని అమలు చేసేందుకు సహకరించాలని కోరారు. అయితే, మున్సిపాలిటీ భవనాల పైకప్పులపై సౌర విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి అదనపు విద్యుత్ విక్రయం ద్వారా ఆదాయం పొందవచ్చని ఐక్య కార్యాచరణ సమితి సూచించింది. మున్సిపాలిటీ భూములను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇచ్చి తాగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు చేయాలని, ప్రజలకు రూ.5కే శుద్ధి చేసిన తాగునీటిని అందించేలా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఆదాయం సమకూర్చుకోవాలని పేర్కొంది.

బీజేపీ కౌన్సిలర్ల గైర్హాజరుపై విమర్శలు...

మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ తరపున గెలుపొందిన కౌన్సిలర్ కొత్త సుమలత పాల్గొన్నారు. అయితే బీజేపీ కౌన్సిలర్లు హాజరై తమ వైఖరి వెల్లడించాల్సి ఉండగా గైర్హాజరు కావడంపై విశ్లేషకుల, పట్టణ ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వారికి అధికారికంగా సమాచారం లేదా.. ఉన్నా కూడా హాజరు కాలేదా..? అనే కోణంలో పలువురు విశ్లేషిస్తున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజా సమస్యల కోసం తమ గళం వినిపించకపోగా ప్రేక్షక పాత్రకే పరిమితం కావడం పట్ల పట్టణ ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

సామాన్యుడిపై అదనపు భారం

మున్సిపాలిటీ పన్నులు విధిస్తే సామాన్యుడిపై అదనపు భారం పడుతుంది. ఇప్పటికే ఇంటి పన్ను, నీటి పన్నుతోపాటు ఇతర పన్నులు చెల్లించడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పన్నుల విధింపు చర్యలను అధికారులు, పాలకవర్గం వెంటనే ఉపసంహరించుకోవాలి.

- ఎన్నం మునిందర్, పట్టణవాసి, పట్టణ ఐక్య కార్యాచరణ సమితి.

ఇతర మార్గాలు అన్వేషించాలి

ప్రజలపై పన్నుల భారం మోపకుండా ఆదాయం పెంపునకు ఇతర మార్గాలు అన్వేషించాలి. ప్రధాన రహదారులు, కూడళ్లు, ప్రజా ప్రదేశాలలో లాలిపాప్ ప్రకటన బోర్డులను ఏర్పాటు చేయాలి. రహదారులపై ఫ్లెక్సీల ఏర్పాటు కోసం నిర్దిష్ట రుసుములు నిర్ణయించి ఆదాయం పొందాలి.

- కొమ్ముల రమణారెడ్డి, పట్టణవాసి, హ్యుమన్ రైట్స్ సెల్ రాష్ట్ర ఐటీ విభాగం అధ్యక్షుడు.

Next Story