- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామాల సమగ్రాభివృద్ధికి కార్యాచరణ వేగవంతం చేయాలి: కలెక్టర్ సత్యప్రసాద్
గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచించారు

దిశ, కోరుట్ల రూరల్: గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్డీవో జీవాకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఐదు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు కనీసం రెండు ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా వ్యవసాయ అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలిక ఆదాయాన్ని అందిస్తుందని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు తెలియజేయాలన్నారు.
గ్రామాల్లో తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించే విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని, నాలుగు రకాల చెత్తను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య పనులు నిరంతరాయంగా కొనసాగాలని, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచాలని తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీల శుభ్రపరిచే పనులు, చెత్త తొలగింపు, దోమల నివారణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
జలసిరి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ భూములను గుర్తించి నీటి కుంటల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని, భూగర్భ జలాల పెంపుతో పాటు రైతులకు సాగునీటి అందుబాటు మెరుగుపడేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి కోరారు. ఈ సమావేశంలో ఆర్డీఓ జివాకర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఎంపీడీఓ రామకృష్ణ, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, సర్పంచులు, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.






