- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా సర్పంచ్ గైర్హాజరు.. భర్త పెత్తనంపై దళిత సంఘాల ఆగ్రహం!
భారత రాజ్యాంగ నిర్మాత, రిజర్వేషన్ల ఫలాలను అందించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఊటూర్ గ్రామంలో వివాదానికి దారితీశాయి

దిశ, మానకొండూరు : భారత రాజ్యాంగ నిర్మాత, రిజర్వేషన్ల ఫలాలను అందించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఊటూర్ గ్రామంలో వివాదానికి దారితీశాయి. ఒక పక్క రాష్ట్రమంతట,దేశమంతట, గ్రామమంతా వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటే, గ్రామ ప్రథమ పౌరురాలు, మహిళా సర్పంచ్ వెలిశెట్టి కళ్యాణి ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
భార్య అధికారం.. భర్త పెత్తనం?
అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల వల్లే మహిళలు నేడు చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో పదవులు అనుభవిస్తున్నారని, అలాంటిది అదే మహనీయుని జయంతికి సర్పంచ్ రాకపోవడం పై అంబేద్కర్ సంఘం నేతలు మండిపడుతున్నారు. సర్పంచ్ కళ్యాణి స్వయంగా వచ్చి విగ్రహానికి పూలమాల వేయాల్సింది పోయి, ఆమెకు బదులుగా ఆమె భర్త కిషోర్ వేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగాన్ని, దళిత సమాజాన్ని అవమానించడమేనని వారు ధ్వజమెత్తారు. "మహనీయుడు అంబేద్కర్ గీసిన బాటలో రిజర్వేషన్ల ద్వారా పదవి పొందిన మహిళా సర్పంచ్, ఆయనకే నివాళులు అర్పించకపోవడం శోచనీయం. భార్య అధికారాన్ని భర్త చెలాయించడం ఏ రకమైన ప్రజాస్వామ్యం? అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ కనుకుంట్ల ఆంజయ్య ఈ సందర్భంగా మహిళా సర్పంచ్ తీరును ఎండగట్టారు. బీ.ఆర్. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యంగా నిర్మాత మహనీయుని జయంతి వేడుకలకు హాజరు కాక పోవడంపై దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్నట్లు దుయ్య బట్టారు. మహనీయుని జయంతి వేడుకలకు గ్రామసర్పంచ్ గైర్హాజరు వెనుక దాగిన్న అంతర్యామేమిటి. అంబేద్కర్ అంటే కేవలం దళితుల దేవుడు అనే సంకుచిత భావనతోనే సర్పంచ్ నిరాకరించారా అని ఆయన ప్రశ్నించారు.
క్షమాపణ చెప్పకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన!
ఈ ఘటనపై ఊటూర్ గ్రామంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. సర్పంచ్ వెంటనే అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సర్పంచ్ స్పందించని పక్షంలో ఈ నిరసనను రాష్ట్రవ్యాప్తం చేస్తామని అంబేద్కర్ సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మామిడి శ్రీనివాస్, అంబేద్కర్ సంఘం యూత్ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ సర్పంచ్ ఎనగందుల సుదర్శన్, మాజీ అంబేద్కర్ ప్రెసిడెంట్ కనుకుంట్ల ఓదయ్య తదితరులు పాల్గొన్నారు.






