ప్రేమ పేరుతో యువ‌తిని మోసం చేసిన యువ‌కుడు

by Ratna Kumari |

ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి మోసం చేసిన నిందితుడితో పాటు అతని తల్లిని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రేమ పేరుతో యువ‌తిని మోసం చేసిన  యువ‌కుడు
X

దిశ, కరీంనగర్ రూరల్: ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి మోసం చేసిన నిందితుడితో పాటు అతని తల్లిని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అభ శుభం తెలియని దళిత యువతిని లోబర్చుకునేందుకు ప్రేమించినట్టుగా నటించారనే ఆరోపణలపై సమగ్రంగా విచారణ జరిపి కటకటాలకు పంపించామని కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు. మీడియా స‌మావేశంలో ఏసీపీ విజ‌య్ కుమార్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ యువతి కరీంనగర్ పట్టణం బొమ్మకల్ సమీపంలోని ఓ ప్రైవేటు హస్పిటల్ లో గత కొంత కాలంగా ఉద్యోగం చేస్తున్నారు. అదే హస్పిటల్ లో ఆరోగ్య శ్రీలో డాటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్న బాగోతం రాకేష్ (24)తో ఏర్పడిన పరిచయంతో తాను ప్రేమిస్తున్నానని సదరు యువతిని నమ్మించాడు.

గత సెప్టెంబర్ నెలలో మాట్లాడుకుందామని చెప్పిన బాగోతం రాకేష్ బాధితురాలిని తన ఇంటికి తీసుకువెళ్లి ఆమెను శారీరంగా వాడుకున్నాడు. భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం కదా అని నమ్మించిన రాకేష్ ఆమె వద్దన్నా వినకుండా పలు మార్లు ఆమె పై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం గురించి రాకేష్ తల్లి పద్మకు బాధితురాలు వివరించగా.. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కదా అని కొడుకు చర్యలకు సానుకూలంగా మాట్లాడింది. గత సంవత్సరం నవంబర్ నెలలో గర్భం దాల్చిన బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని రాకేష్ ను అడగగా అతను కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకువచ్చి వాటిని వేసుకోవాలని లేనట్టయితే చంపేస్తానని బెదిరించాడు. ట్యాబ్లెట్లు వేసుకుంటేనే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన రాకేష్ గురించి అతని తల్లి పద్మకు చెప్పుకోగా కులం పేరుతో దూషిస్తూ... నిన్ను నా కొడుకు ఎలా పెళ్లి చేసుకుంటాడనుకున్నావంటూ దుర్భాషలాడింది. ఈ మేరకు బాధితురాలు కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డికి పిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. అట్రాసిటీ కేసుతో పాటు అత్యాచారం కేసుకు సంబంధించిన పూర్తి విచారణ జరిపిన అనంతరం బొమ్మకల్ గ్రామానికి చెందిన తల్లి, కొడుకులు పద్మ, రాకేష్ లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు.

Next Story