ప్రేమ వివాహం చేసుకున్నాడ‌ని యువ‌కుడిపై క‌త్తుల‌తో దాడి

by Ratna Kumari |   (  Updated:2026-02-27 15:34:19  IST  )

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న సఖీ సెంటర్ ఆవరణలో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై అమ్మాయి తరపు బంధువులు కత్తులతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.

ప్రేమ వివాహం చేసుకున్నాడ‌ని యువ‌కుడిపై క‌త్తుల‌తో దాడి
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న సఖీ సెంటర్ ఆవరణలో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై అమ్మాయి తరపు బంధువులు కత్తులతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. మల్యాల మండలం లంబాడిపెల్లి గ్రామానికి చెందిన ఎనగందుల అనిల్ అదే మండలానికి చెందిన ఓ యువతిని ఈ నెల 21న ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం అమ్మాయి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కౌన్సిలింగ్ నిమిత్తం యువతిని జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్‌కు తరలించారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం యువతిని కలిసేందుకు అనిల్ సఖీ సెంటర్‌కు వచ్చాడు. ఇదే సమయంలో పక్కా ప్లాన్ తో ఉన్న అమ్మాయి తరపు బంధువులు సఖి సెంటర్ ఆవరణలోనే అనిల్‌పై విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్రంగా కొట్టడమే కాకుండా కత్తితో దాడి చేయడంతో అనిల్ గాయపడ్డాడు. సఖీ సెంటర్ సిబ్బంది అప్రమత్తంగా స్పందించి దాడి చేసిన వారిని బయటకు పంపించి గేట్లు మూసివేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకుని గాయపడిన అనిల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే వివాహం అయిన యువకుడు మరో యువతిని ప్రేమ వివాహం చేసుకోవడం, ఆపై సఖి సెంటర్ ఆవరణలోనే దాడి జరగడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story