అక్రమాల అంజనా.. 'లేఅవుట్' వెనుక భారీ స్కామ్

by Ajay Maddhiboyina |

రియల్ ఎస్టేట్ రంగంలో లాభార్జనే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కి సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.

అక్రమాల అంజనా.. లేఅవుట్ వెనుక భారీ స్కామ్
X

​దిశ, బ్యూరో కరీంనగర్: రియల్ ఎస్టేట్ రంగంలో లాభార్జనే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కి సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. జమ్మికుంట పట్టణంలో వెలుగుచూసిన 'అంజనా టౌన్‌షిప్' అక్రమ దందా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డీటీపీసీ అనుమతులు ఉన్నాయని నమ్మబలికి అసలు అనుమతులే లేని భూమిని అంటగడుతూ అమాయక ప్రజల రక్తాన్ని జుర్రుకుంటున్న వైనం బట్టబయలైంది.​అంజనా టౌన్‌షిప్ నిర్వాహకులు ఆడుతున్న ఈ మాయాజాలం సామాన్యులకు అర్థం కాకుండా సాగుతోంది. రికార్డుల ప్రకారం.. వీరు సర్వే నంబర్లు 94, 95, 100 లలో కేవలం 9 ఎకరాల 30 గుంటలకు మాత్రమే అనుమతి పొందారు. కానీ క్షేత్రస్థాయిలో అసలు అనుమతే లేని సర్వే నంబర్ 103 లో ప్లాట్లు వేసి యథేచ్ఛగా విక్రయాలు జరుపుతున్నారు. నిబంధనల ప్రకారం లేఅవుట్ అనుమతి లేని సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లు చేయడం తీవ్రమైన నేరం. కానీ ఇక్కడ అంజనా టౌన్‌షిప్ నిర్వాహకులు చట్టాన్ని చుట్టచుట్టేసి రిజిస్ట్రేషన్ల పర్వాన్ని సాగిస్తుండటం గమనార్హం.

భూమి లెక్కల్లో 'మాయాజాలం'..

ఆ 1.14 ఎకరాలు ఎవరి సొత్తు?

​టౌన్‌షిప్ కాంపౌండ్ వాల్ లోపల ఉన్న భూమి లెక్కలు చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.​రికార్డుల ప్రకారం అనుమతి పొందిన భూమి 9 ఎకరాల 30 గుంటలు.​క్షేత్రస్థాయిలో ఆక్రమించిన భూమి 11 ఎకరాల 04 గుంటలు. ​తేడా (భారీ స్కామ్) 1 ఎకరా 14 గుంటలు. ​ఈ అదనపు భూమి ఎక్కడిది? ఇది ప్రభుత్వ భూమా? లేక పక్కనే ఉన్న అమాయక రైతుల భూమిని కాజేసి కాంపౌండ్ వాల్ లోపల కలిపేశారా? ఇంత భారీ స్థాయిలో భూమి కబ్జా జరిగినా రెవెన్యూ , మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న 'మర్మమేమిటో' అర్థం కావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదు....

​ఈ అక్రమాలపై సామాజిక కార్యకర్తలు జిల్లా కలెక్టర్, రిజిస్ట్రార్ మరియు డీటీపీసీ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేయడంతో అధికార యంత్రాంగం కదిలింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సర్వే నంబర్ 103 లో రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లకు ఇల్లు కట్టుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వకూడదని జమ్మికుంట మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ​దీంతో ప్లాట్లు కొన్న సామాన్యుల పరిస్థితి‘అడకత్తెరలో పోకచెక్క’లా మారింది. ‘కష్టపడి సంపాదించిన డబ్బుతో ప్లాట్లు కొంటే, ఇప్పుడు ఇల్లు కట్టుకోనివ్వడం లేదు. మా డబ్బులు మాకు తిరిగి ఇప్పించి, ఈ మోసగాళ్లపై చర్యలు తీసుకోవాలి’ అని బాధితులు లబోదిబోమంటున్నారు.

​ప్రజలారా జాగ్రత్త!

​అంజనా టౌన్‌షిప్ నిర్వాహకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అనుమతులు లేని చోట ప్లాట్లు కొంటే మీ పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు లోతైన విచారణ జరిపి, ఈ 'అంజనా' అక్రమ సామ్రాజ్యాన్ని కూల్చివేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ..

చిలువేరు శ్రీకాంత్ (సామాజిక కార్యకర్త)

‘103 సర్వే నెంబరు భూమికి ఎలాంటి అనుమతులు లేవు. కానీ అంజన టౌన్​షిప్ వ్యాపారులు ఇక్కడ ప్లాట్లు అక్రమంగా విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారు. జిల్లా రిజిస్ట్రార్ అధికారికి దీనిపై ఫిర్యాదు చేశాను. వెంటనే ఆ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి మోసానికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. లేకపోతే మరింత మంది అమాయకులు బలైపోయే ప్రమాదం ఉంది.

Next Story