వెక్కిరిస్తున్న వృద్ధాప్యం.. పట్టించుకోని సంతానం

by Jakkula.Mamatha |

"ముసలోళ్ల సంగతి మాకు అవసరం లేదు.. పెన్షన్ పైసలు ఇస్తేనే తిండి పెడతాం లేకపోతే బిడ్డ దగ్గరికే పో..

వెక్కిరిస్తున్న వృద్ధాప్యం.. పట్టించుకోని సంతానం
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : "ముసలోళ్ల సంగతి మాకు అవసరం లేదు.. పెన్షన్ పైసలు ఇస్తేనే తిండి పెడతాం లేకపోతే బిడ్డ దగ్గరికే పో.. నీ కడుపున నేను ఒక్కడినే పుట్టలేదు కదా నేనెందుకు నిన్ను పోషించాలి.. " ఇదే నేటి సమాజంలో అనేక మంది వృద్ధులు ఎదుర్కొంటున్న పరిస్థితి. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలే వారి పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారు. పేరెంట్స్ సంపాదించిన ఆస్తులను పంచుకుంటున్న పిల్లలు వారి పోషణ, బాగోగులను మాత్రం చూడడం లేదు. కష్టపడి కని పెంచి ప్రయోజకులను చేస్తే కనీసం బుక్కెడు బువ్వ పెట్టడం లేదంటూ ఇటీవల కాలంలో పండుటాకులు పోలీసులను ఆశ్రయిస్తున్న ఘటనలు జిల్లాలో పెరిగాయి.

అన్నం కూడా పెట్టట్లేదు..

జగిత్యాల అర్బన్ మండలం మోతే గ్రామానికి చెందిన బొల్లె భూమయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు కాగా, చిన్న కొడుకు గతంలోనే చనిపోయాడు. ఇక అప్పటి నుంచి పెద్ద కొడుకు వద్ద కొన్ని రోజులు చిన్న కొడుకు భార్య (కోడలు) వద్ద కొన్ని రోజులు ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే రెండు నెలలుగా అటు కొడుకుతో పాటు కోడలు కూడా పట్టించుకోకపోవడంతో భూమయ్య దంపతులు బుధవారం జగిత్యాల రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ఆరు ఎకరాల భూమి సంపాదించి ఇస్తే కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టడం లేదంటూ వృద్ధ దంపతులు కన్నీటి పర్యంతం అయ్యారు.

వృద్ధుల సంరక్షణ చట్టాలపై అవగాహన అవసరం..

కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్లు దాటిన వారికి అండగా నిలిచేందుకు వయో వృద్ధుల సంరక్షణ చట్టం-2007 ను తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం వృద్ధులైన తల్లిదండ్రుల పోషణ వారి బాగోగులను విస్మరించిన పిల్లలపై చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇంటి నుంచి గెంటి వేయబడుతున్న వృద్ధులు, వృద్ధాప్యం తో బాధపడుతూ నిరాధారణకు గురైతున్న వారు స్థానికంగా ఉన్న ఆర్డీవోలకు ఫిర్యాదు చేసి న్యాయ సహాయం పొందవచ్చు. లేదా జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఇలాంటి చట్టాలపై సమాజంలో పెద్దగా అవగాహన లేదనేది వాస్తవం. సీనియర్ సిటిజన్స్ కు ఉండే హక్కులు, అమలు చేయబడుతున్న చట్టాలపై మరింత విరివిగా అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది.

కొన్ని ఘటనలు..

వృద్ధాప్యంలో అక్కున చేర్చుకుంటాడు అనుకుంటే ఉన్న ఆస్తులన్నీ అమ్మేశారని జగిత్యాల ఆర్ఎన్టీ నగర్ కు చెందిన తుదగేని రాధమ్మ అనే వృద్ధురాలు ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. తన భర్త భీమయ్య మరణానంతరం రాములు అనే వ్యక్తి తాను భీమయ్య కు పుట్టిన కొడుకునే అంటూ వస్తే చేరదీస్తే అక్రమంగా తన ఆస్తులన్నీ అమ్మడమే కాకుండా ఉన్న ఇంటిని కూడా కూల్చేసి బయటకు గెంటేసాడని అవేదన వ్యక్తం చేసింది. సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలని ఆమె కొడుకు ఈ ఏడాది జులై నెలలో కొట్టి ఇంటి నుంచి గెంటేశారు.

దీంతో ఆ తల్లి ఆర్డీవో కు ఫిర్యాదు చేయగా ఆమె ఇద్దరు కొడుకులతో పాటు కోడళ్లకు వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం సెక్షన్ 2(బి ), సెక్షన్ 4(1) సెక్షన్ 24 ప్రకారం కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. గత ఏడాది డిసెంబర్ లో జగిత్యాలకు చెందిన వృద్దురాలిని పింఛన్ డబ్బుల కోసం ఆమె చిన్న కొడుకు దాడి చేసి గాయపరిచాడు. కాలికి గాయమై నడవలేని స్థితిలో ఉండటం తో తల్లిని స్మశానం లో వదిలి వెళ్లారు. దీంతో నలుగురు కొడుకులు ఉన్నా ఆ అవ్వ అనాథగా మారింది. కర్మకాండలు చేసేందుకు వచ్చే వాళ్లు ఇచ్చేది తినుకుంటూ కొద్ది రోజుల క్రితం స్మశానంలోనే కన్ను మూసింది.

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఆదరించకపోతే జైలుకే..

హరి ఆశోక్ కుమార్, తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వయోవృద్ధుల సంరక్షణ చట్టం పై విరివిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తు న్నామని తెలిపారు. మా అసోసియేషన్ తరపున చేసిన సర్వే లో వృద్ధులను వేధింపులకు గురి చేస్తున్న వారిలో కొడుకులు 60 శాతం, కొడళ్లు శాతం, కూతుర్లు శాతం ఉన్నట్లు తెలిసింది. నిరాదరణకు గురవుతున్న వృద్ధులు వారి సమస్యలను మా దృష్టికి తీసుకువస్తే సహాయం అందిస్తున్నాం. పేరెంట్స్ ను ఆదరించకపోతే జైలు పాలవడం తప్పదని హెచ్చరించారు.

Next Story