‘సింగరేణి’ పెనువిషాదానికి 22 ఏళ్లు

by Ajay Maddhiboyina |

సింగరేణి చరిత్రలోనే రెండో అతిపెద్ద ప్రమాదంగా, సంస్థ ప్రతిష్టకు మాయని మచ్చలా, కార్మిక వర్గానికి పీడకలగా మిగిలిన 8ఏ గని ప్రమాదానికి నేటితో 22 ఏళ్లు నిండాయి. 2003 అక్టోబర్ 16న అర్ధరాత్రి రామగుండం రీజియన్-2 డివిజన్ పరిధిలోని జీడీకే-8ఏ గనిలో పైకప్పు నుంచి బండరాయి కూలిన ఘటనలో పది మంది కార్మికులు దుర్మరణం చెందారు.

‘సింగరేణి’ పెనువిషాదానికి 22 ఏళ్లు
X

దిశ, యైటింక్లయిన్ కాలనీ: సింగరేణి చరిత్రలోనే రెండో అతిపెద్ద ప్రమాదంగా, సంస్థ ప్రతిష్టకు మాయని మచ్చలా, కార్మిక వర్గానికి పీడకలగా మిగిలిన 8ఏ గని ప్రమాదానికి నేటితో 22 ఏళ్లు నిండాయి. 2003 అక్టోబర్ 16న అర్ధరాత్రి రామగుండం రీజియన్-2 డివిజన్ పరిధిలోని జీడీకే-8ఏ గనిలో పైకప్పు నుంచి బండరాయి కూలిన ఘటనలో పది మంది కార్మికులు దుర్మరణం చెందారు. మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది రెండు రోజులపాటు శ్రమించాల్సి వచ్చింది. మృతి చెందిన కార్మికుల జ్ఞాపకార్థం గని సమీపంలోనే స్మారక స్తూపం నిర్మించగా, నేడు అక్కడ సంస్మరణ సభ నిర్వహించనున్నారు.

ఆరోజు ఏం జరిగిందటే..

ఆర్జీ-2 పరిధిలోని 8ఏ గనిలో 2003 అక్టోబర్ 16న రెండో షిఫ్టు ముగిసింది. నైట్ షిఫ్టు డిస్ట్రిబ్యూషన్ అనంతరం కార్మికులు గనిలోకి వెళ్లారు. అర్ధరాత్రి 1.30 సమయంలో గనిలోని తొమ్మిదో డీప్ సమీపంలో ఎలాంటి శబ్దం రాకుండా బండ కూలింది. అప్పుడు అక్కడ 12 మంది కార్మికులు విధులు నిర్వహిస్తుండగా.. ఇద్దరు తృటిలో తప్పించుకున్నారు. మిగిలిన పదిమంది బండరాయి కింద నలిగి అక్కడికక్కడే చనిపోయారు.. ప్రమాదంలో కార్మికుల మృతదేహాలు నుజ్జు కాగా, మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది రెండు రోజులు శ్రమించాల్సి వచ్చింది. అప్పటికి నాలుగు నెలల ముందే 7ఎల్ పీలో జరిగిన జలప్రమాదంలో 17 మంది కార్మికులు మృతి చెందారు. 8ఏ గని ప్రమాద వార్త తెలుసుకున్న పారిశ్రామిక ప్రాంత ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున గని వద్దకు చేరుకున్నారు. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, కార్మికులకు సంతాపసూచకంగా పారిశ్రామిక ప్రాంతంలోని అన్నివర్గాలు బంద్ పాటించాయి.

ఉమ్మడి ఏపీలో అప్పటి బొగ్గుశాఖ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎంపీ సుగుణకుమారి, కాకా, డీ శ్రీనివాస్, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, కేసీఆర్, బాలగోపాల్ వంటి నేతలు గనికి వచ్చి ప్రమాద ఘటనపై ఆరాతీశారు. మృతుల కుటుంబాలను కలిసి తమ సంతాపాన్ని ప్రకటించారు. రక్షణ చర్యల్లో లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని యాజమాన్య వైఖరిని తప్పుబట్టారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 7ఎల్ఈపీ ప్రమాదంతో పాటు 8ఏప్రమాదాలపై అప్పటి హైకోర్టు జస్టిస్ బిలాల నఖ్వి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి కోర్టు ఆఫ్ ఎంక్వయిరీని ఏర్పాటు చేశారు. విచారణ కమిటీ నివేదికను ప్రభుత్వానికి అప్పగించింది. నివేదికలోని అంశాలు మరుగున పడిపోగా.. ప్రమాద కారకులపై ఇప్పటి వరకు సింగరేణి యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కార్మికుల మృతికి చిహ్నంగా 8ఏ సమీపంలో స్తూపాన్ని నిర్మించగా, ప్రతి ఏడాది అక్టోబర్ 17న మృతులను స్మరిస్తూ స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు.

Next Story