జూబ్లీహిల్స్ బైపోల్‌పై కన్నేసిన ‘కమలం’! ఐదుగురితో మానిటరింగ్ కమిటీ

by Kema Shiva Kumar |

జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.

జూబ్లీహిల్స్ బైపోల్‌పై కన్నేసిన ‘కమలం’! ఐదుగురితో మానిటరింగ్ కమిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. బై ఎలక్షన్ లో ఎలాగైనా ఇక్కడ గెలిచి తీరాలని కంకణం కట్టుకుంది. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 8స్థానాల్లో గెలిచిన బీజేపీ, జూబ్లీహిల్స్ లోనూ గెలిచి మరోస్థానాన్ని ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలను పర్యవేక్షించేందుకు ఏకంగా పర్యవేక్షణ కమిటీని అధిష్టానం నియమించింది.

పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై పర్యవేక్షణ కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు శుక్రవారం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రకటించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ రఘునందన్‌రావు, మాజీఎంపీ గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్‌రావును నియమించారు.

నేడు కేంద్ర మంత్రి సమావేశం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికే లక్ష్యంగా శనివారం కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి కీలక మీటింగ్ నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ బూత్ కమిటీ సమావేశం సాయంత్రం 4 గంటలకు యూసుఫ్‌గూడలోని మహబూబ్ మాన్షన్‌లో నిర్వహించనున్నారు. ఉపఎన్నికపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

Next Story