- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయనకు టికెట్ ఎందుకు ఇచ్చిందో బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి: కవిత డిమాండ్
బీసీల నోటికాడి ముద్దను గుంజుకున్న బుట్టంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఎలా ఇచ్చిందో ప్రజలకు ఆ పార్టీ సమాధానం చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీల నోటికాడి ముద్దను గుంజుకున్న బుట్టంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఎలా ఇచ్చిందో ప్రజలకు ఆ పార్టీ సమాధానం చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం జాగృతి భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసిన వ్యక్తి మాధవరెడ్డి అని.. ఆయనకు టికెట్ ఇవ్వటంతో బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని బీఆర్ఎస్ రాజముద్రతో చెప్పినట్లైందని పేర్కొన్నారు. బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం జాగృతి సహా బీసీ సంఘాలన్నీ పోరాటం చేస్తున్నాయని.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 42 శాతం రిజర్వేషన్ల బిల్లు వచ్చేలా చేశామని చెప్పారు. కానీ.. మాధవరెడ్డి సహా మరొక వ్యక్తి దీనిపై పిటిషన్ వేశారని తెలిపారు. అంటే ఈ కేసును బీఆర్ఎస్ వేయించిందా? బీసీల రిజర్వేషన్లకు బీఆర్ఎస్ వ్యతిరేకమా? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మాధవరెడ్డి అనే వ్యక్తి హరీశ్‌రావుకు దగ్గర అని.. హరీశ్ ఆయనను తప్పుదోవ పట్టించి కేసు వేయించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ బీసీల విషయంలో చిత్తశుద్ధితో లేదన్నారు. పార్టీ పరంగానూ వాళ్లు ఏనాడూ మీటింగులు పెట్టలేదని.. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరమ్ పేరుతో మాత్రమే పెట్టారని తెలిపారు. జనగణనన విషయంలోనూ ముందు కన్‌ఫ్యూజ్ చేశారని.. తర్వాత మళ్లీ జనగణన చేయాలంటూ డిమాండ్ చేశారని అన్నారు. అందుకే బీసీలంతా బీఆర్ఎస్ పార్టీ వైఖరిని గమనించాలని కోరారు.
కాంగ్రెస్ పరిస్థితి సిగ్గుచేటు..
ఇక కాంగ్రెస్ పరిస్థితి అయితే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు ఉన్నదని.. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అరికెపూడి గాంధీని నిజామాబాద్ ఎన్నికలకు ఇన్‌చార్జిగా పంపించారని కవిత అన్నారు. పార్టీ పరంగా లెటర్ ఇచ్చి మరి ఆయనను కాంగ్రెస్ ఇన్‌చార్జిగా వేసిందని.. నిజానికి బీఆర్ఎస్ తరపున గెలిచిన ఆయనకు ప్రతిపక్షాలకు ఇచ్చే పీఏసీ చైర్మన్ పదవి కూడా ఉన్నదని చెప్పారు. స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకటించిన ప్రకాశ్‌గౌడ్, తెల్లం వెంకట్రావును సైతం కాంగ్రెస్ ఇన్‌చార్జులుగా నియమించిందన్నారు. అంటే ప్రజల తీర్పును కాంగ్రెస్ పార్టీ హేళన చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలు ఎవరినీ నమ్మాలో, ఎవరినీ నమ్మొద్దో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అందుకే తమ లాంటి సంస్థలు ప్రజల తరఫున మాట్లాడుతున్నామన్నారు. రాహుల్‌గాంధీ పట్టుకునే రాజ్యాంగం మీద కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉంటే అరికెపూడి గాంధీని ఇన్‌చార్జిగా తీసివేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఇప్పుడైనా ఆయన మీద అనర్హత వేటు వేయాలన్నారు. ఇక బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు బడ్జెట్ పెడతామని కాంగ్రెస్ చెప్పిందని.. గత రెండు బడ్జెట్లు కలిపి ఏడువేల కోట్లు కేటాయించలేదని అన్నారు. ఇప్పుడైనా బీసీ సబ్ ప్లాన్‌పై కసరత్తు చేయాలని అన్నారు. బీఆర్ఎస్ ఉద్యమకారులను మోసం చేసిందన్న కారణంతో వారంతా కాంగ్రెస్‌కు ఓటు వేశారని.. కానీ కాంగ్రెస్ సైతం వారికి న్యాయం చేయడం లేదని ఆరోపించారు. ఉద్యమకారులకు ఇస్తామన్న భూమి కోసం తాము కరీంనగర్‌లో భూపోరాటం చేశామన్నారు.
12న ఆత్మగౌరవ సభ
ఈ నెల 12న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ పెడుతున్నామని.. ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగే ఈ సభకు పెద్ద ఎత్తున ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ వాదులు హాజరుకావాలని కవిత కోరారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయని.. కానీ పార్టీలు ఎలా వ్యవహరిస్తున్నాయన్నది ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను ఎలా మోసం చేశాయో చూశామని.. బీజేపీ గురించి మాట్లాడుకోవటం వృథా అని తెలిపారు. ప్రజలకు మంచి చేద్దామన్న ఉద్దేశంతో తాము సింహం గుర్తుపై పోటీ చేస్తున్నామని.. తమలాగే ప్రశ్నించే సీపీఎం, న్యూడెమోక్రసీ సహా స్వతంత్ర అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అలాగే.. ఉద్యమంలో మనందరికీ ఒక పేజీ ఉంటే కేసీఆర్‌కు పుస్తకమే ఉంటుందని.. ఆయన చరిత్రను ఎవరూ చెరిపేయలేరని అన్నారు. రేవంత్‌కు సైతం చరిత్ర ఉంటుందని.. కానీ అది మంచి చరిత్రనా కాదా అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో మర్యాదపూర్వకమైన రాజకీయాలు ఉండాలని తాను కోరుకుంటున్నానని.. విమర్శలు చేసేప్పుడు ఒక లైన్ ఉంటుందని.. కానీ సీఎం అన్ని లైన్లు దాటి విమర్శలు చేశారని పేర్కొన్నారు. ఒక జాతిని విమర్శించటం ఎవరూ హర్షించరన్నారు. అలాగే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావు అనే చిన్న చేపను పట్టుకొని పెద్ద చేపలను వదిలేసే ప్రయత్నం జరుగుతున్నట్లు అనిపిస్తున్నదని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును టీవీ సీరియల్ మాదిరిగా సాగదీస్తున్నారని.. ఎప్పుడు తుది దశకు తెస్తారో చెప్పాలన్నారు.
మూడు నెలల్లో మా పార్టీ
తొందరలోనే తమ పార్టీ అనౌన్స్‌మెంట్ ఉంటుందని.. మూడు నెలల్లో పార్టీ ప్రకటన ఉండొచ్చని కవిత చెప్పారు. మీడియా సమావేశం అనంతరం ఆమె చిట్ చాట్ నిర్వహించారు. మంచి ముహూర్తం కోసం చూస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో రకరకాల పేర్లు ప్రచారం జరుగుతున్నాయని.. అవన్నీ ఫేక్ అని తెలిపారు. తాము ప్రధానంగా ఏజెండా మీద ఫోకస్ పెట్టామని అన్నారు. తాను అడుగున్న ప్రశ్నలకు హరీశ్‌రావు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. మౌనం అంగీకారం అనుకోవాలా అని ప్రశ్నించారు. అలాగే.. రేవంత్ వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజలే తనను లీడర్ చేయాలి కానీ బీఆర్ఎస్ పార్టీ కాదు కదా అని అన్నారు. పార్టీ మొదలుపెట్టినప్పుడు ఏదైనా టఫ్‌గానే ఉంటుందని.. కానీ భవిష్యత్తులో అన్నింటినీ సాధిస్తామని చెప్పారు. అలాగే.. సిరిసిల్లలో పోటీ చేస్తామని 16 నుంచి 17 మంది బీఆర్ఎస్ వాళ్ళు తమను సంప్రదించారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నట్లు అర్థం అవుతున్నదని.. అందుకే కీలక నేతలు రాష్ట్రవ్యాప్తంగా తిరగడం లేదని ఆరోపించారు. కేవలం సింహం గుర్తు మీద పోటీ చేస్తున్న వారి ఇలాకాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో మూడు పార్టీలు సైతం మోసం చేశాయన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేయడం లేదని, ఆడ బిడ్డలు చదువుకు దూరం అవుతే ఆ పాపం రేవంత్‌దేనని అన్నారు. రేవంత్‌ను చూసి కేటీఆర్ సైతం రెచ్చిపోయి లైన్ దాటుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ ఎదుర్కొలేకపోతున్నదని.. అందుకే మున్సిపల్ ఎన్నికలలో కమ్యూనిస్ట్, బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసుకున్న డీల్‌ను రైతుల దృష్టికి తీసుకెళ్తామని.. అమెరికా నుంచి పెద్ద ఎత్తున దిగుబడులు వస్తేనే ఇక్కడి రైతులకు నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని.. దాని మీద స్టడీ చేసి పెద్ద ఎత్తున ఫైట్ చేస్తామని స్పష్టం చేశారు.






