TG: ఎన్నికల కమిషనర్‌కు కల్వకుంట్ల కవిత ఫోన్

by Gantepaka Srikanth |

4 నుంచి జాగృతి జనంబాట కొనసాగింపు

TG: ఎన్నికల కమిషనర్‌కు కల్వకుంట్ల కవిత ఫోన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం సొమ్ముతో ప్రచారమా? అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’లో విమర్శించారు. ఎన్నికలు గ్రామాల్లో ఉంటే జిల్లా కేంద్రాలకు వెళ్లి సీఎం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారట అని ఎద్దేవా చేశారు. అక్కడికి జిల్లా ప్రజలందరినీ ప్రభుత్వం సొమ్ముతో తరలించి తమ సందేశం ఇస్తారట అని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ఎన్నికల నిబంధనను ఉల్లంఘించటమే అని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఈ విషయంలో జోక్యం చేసుకుని, సీఎం పర్యటనను నిలిపివేయాలని కోరారు. అలాగే.. ప్రభుత్వ సొమ్ముతో సీఎం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం ఆరు జిల్లాల్లో ప్రచార సభలు నిర్వహించడంపై ఆదివారం ఉదయం రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ జాగృతి ఫిర్యాదు చేసింది. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదినితో కవిత ఫోన్‌లో మాట్లాడారు. ప్రజాధనం అక్రమ మార్గాల్లో ఖర్చు చేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధిపొందాలని చూస్తున్నారని వివరించారు. ఈ మేరకు కమిషనర్ స్పందించినట్లు తెలిపారు. సీఎం జిల్లాల పర్యటనలపై సీరియస్‌గా దృష్టి సారించామని వెల్లడించారని తెలిపారు. జిల్లాల పర్యటనలకు కలెక్టర్లు హాజరు కాకుండా ఆదేశాలు ఇచ్చే విషయం పరిశీలిస్తున్నామని పేర్కొన్నారని తెలిపారు.

4 నుంచి జాగృతి జనంబాట కొనసాగింపు

కవిత చేపట్టిన జాగృతి జనంబాట యాత్రను ఈ నెల 4వ తేదీ నుంచి కొనసాగించనున్నారు. అక్టోబర్ 25వ తేదీన నిజామాబాద్‌లో కవిత జనంబాట యాత్ర ప్రారంభించారు. మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్-హన్మకొండ, నల్గొండ, మెదక్, ఖమ్మం, రంగారెడ్డి, వనపర్తి, కామారెడ్డి జిల్లాల్లో యాత్ర పూర్తి చేశారు. కామారెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ రావడంతో గ్రామీణ జిల్లాల్లో యాత్రను నిలిపివేశారు. ఎన్నికల కోడ్ లేని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నాలుగో తేదీ నుంచి ఏడో తేదీ వరకు యాత్ర నిర్వహించనున్నారు. హైదరాబాద్ జిల్లాలో డిసెంబర్ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు యాత్ర చేపడుతారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 18, 19 తేదీల్లో, గద్వాల జిల్లాలో 21, 22 తేదీల్లో యాత్ర నిర్వహిస్తారు. యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, సూర్యాపేట, సిరిసిల్ల, జనగామ, భూపాలపల్లి, ఆసిఫాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, ములుగు, జగిత్యాల, మహబూబాబాద్, నిర్మల్, నారాయణపేట, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాలో ఫిబ్రవరి మూడో వారం వరకు యాత్ర కొనసాగిస్తారు.

Next Story