వాళ్లు ఏ పేరు చెబితే అదే పార్టీ పేరుగా ఫైనల్ చేస్తా: కవిత

by Gantepaka Srikanth |

వాళ్లు ఏ పేరు చెబితే అదే పార్టీ పేరుగా ఫైనల్ చేస్తా: కవిత

వాళ్లు ఏ పేరు చెబితే అదే పార్టీ పేరుగా ఫైనల్ చేస్తా: కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో: సామాజిక తెలంగాణనే తన లక్ష్యమని.. 2029 ఎన్నికల్లో తాము పోటీలో ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. సోమవారం ‘ఆస్క్ కవిత’ హ్యాష్ ట్యాగ్‌పై ఎక్స్‌లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. కొత్త పార్టీకి సంబంధించి అడిగిన ప్రశ్నకు 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడుతామన్నారు. యువత, మహిళలు వారికి నచ్చిన రంగాల్లో అవకాశాలు పొందాలని.. అందుకు వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. యువత, మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు జాగృతి కృషి చేస్తుందన్నారు. తెలంగాణ సాధికారిత సాధించాలంటే మెరుగైన, నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని అన్నారు. తెలంగాణలో తల్లితండ్రులు పిల్లల చదువుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఉండే పరిస్థితి రావాలన్నారు.

ఉద్యోగాలు, స్కిల్, భద్రత మూడింటిలో దేనికి ప్రాధాన్యం ఇస్తారని ప్రశ్నించగా.. యువతకు ఉద్యోగాలు కల్పించటమే తన ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. క్రమంగా జాగృతిని బలంగా తయారు చేస్తామని చెప్పారు. త్వరలోనే జాగృతి మెంబర్‌షిప్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తామన్నారు. రేవంత్ పాలన ఎలా ఉందన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవటంతో లక్షలాది మంది విద్యార్థులు చదువులకు దూరం కావాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రైతుల ఆత్మహత్యలు చాలా బాధాకరమని చెప్పారు. ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూముల్లో ఫ్యూచర్ సిటీ అంటూ హడావుడి చేయటంపై మండిపడ్డారు. త్వరలోనే అక్కడి రైతులకు మద్దతుగా పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక సింగరేణి సంస్థను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎంఎస్‌తో కలిసి సింగరేణి కోసం ప్రభుత్వం పై పోరాటం చేస్తామన్నారు. హైదరాబాద్‌లో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవటంపై కవిత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెస్ట్ సిటీపై పెట్టిన శ్రద్ధ, ఈస్ట్ సిటీని అభివృద్ధి చేయటంలో పెట్టలేదన్నారు.

చిరంజీవి అభిమానిని..

కవిత వ్యక్తిగత అభిరుచులకు సంబంధించి పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. రామ్‌చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలని అడగగా.. చాలా హంబుల్‌గా ఉండే వ్యక్తి అని, మంచి డ్యాన్సర్ అని అన్నారు. అయితే.. తాను చిరంజీవి అభిమానిని అని.. చిరంజీవి తర్వాతే రామ్‌చరణ్ అని అన్నారు. చిన్నప్పుడు ఎర్రమంజిల్‌లో గడిపిన క్షణాలు తనకు చాలా సంతోషానిచ్చాయని అన్నారు. రాజకీయాలు కాకుండా ఏదైనా బిజినెస్‌పై దృష్టి పెట్టాలంటూ ఓ నెటిజన్ సూచించగా.. సోషల్ మీడియాలో ఇలాంటి చాలా నెగిటివిటీ ఉంటుందని, దాన్ని పట్టించుకోకుండా మంచిగా ఆలోచించాలని సూచించారు. కాగా.. సోమవారం ఎక్స్ పాలిటిక్స్ విభాగంలో ఈ ఇంటరాక్షన్ నంబర్ వన్‌గా నిలిచింది.

Next Story