- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబేద్కర్ పెట్టిన భిక్ష అని గుర్తుపెట్టుకోండి: కవిత కీలక వ్యాఖ్యలు
సీఎం రేవంత్‌రెడ్డి యాంటీ అంబేద్కర్ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ భూమి మీద ఎవరైనా అంబేద్కర్ వ్యతిరేకి ఉన్నారంటే అది రేవంత్‌రెడ్డే మాత్రమేనని అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి యాంటీ అంబేద్కర్ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ భూమి మీద ఎవరైనా అంబేద్కర్ వ్యతిరేకి ఉన్నారంటే అది రేవంత్‌రెడ్డే మాత్రమేనని అన్నారు. ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో సోమవారం అర్ధరాత్రి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బాబా సాహెబ్ జయంతి సందర్భంగానైనా ఈ సీఎంకు బుద్ధి వచ్చి పేదలకు న్యాయం చేసే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదని.. ఒక ఐడియాలజీ, ఒక థాట్ అని చెప్పారు. మహిళలు అభివృద్ధి చెందితేనే ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని భావించిన బాబా సాహెబ్ మహిళల కోసం ఎంతో చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందంటే అది బాబా సాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష అని గుర్తు చేశారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అనే శక్తి లేకపోతే రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయ్యేదే కాదని అన్నారు.
రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కట్టినా సరే దళితులకు చెందిన అసైన్డ్ భూములనే ప్రభుత్వాలు లాక్కుంటున్నాయన్నారు. వెలుగుమట్లలో అదే చేశారని.. ఇప్పుడు పరిగిలో కూడా 1200 ఎకరాలు సేకరిస్తే.. అందులో వెయ్యి ఎకరాలు అసైన్డ్ భూములేనని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో మరిన్ని ఉద్యమాలు వచ్చి ప్రజల కష్టాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు. నల్లమలలోని సహజ సంపదను కొల్లగొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. చెంచులను బలి చేస్తున్నాయని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం కడిచింతలపైలు, సార్లపల్లి చెంచుపెంటల్లో 200లకు పైగా చెంచు కుటుంబాలను బలవంతంగా తరలించేందుకు ఒత్తిడి చేస్తున్నారన్నారు. చెంచులను అడవికి దూరం చేసే ప్రయత్నాలు మానుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. లేదంటే అడవి బిడ్డల తరఫున జాగృతి పోరాటం చేస్తుందని హెచ్చరించారు.






