- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్టీ పెట్టడానికి ప్రకృతి ఆశీర్వాదం ఇచ్చింది: కల్వకుంట్ల కవిత
కోర్టు తీర్పుపై కేటీఆర్ చేసిన ట్వీట్‌లో లిక్కర్ కేసు కారణంగానే పార్టీ ఓడిపోయినట్లు రాశారని.. బీఆర్ఎస్ ఓటమిని తన మెడలో వేయొద్దని.. అలా చేయాలని చూస్తే ప్రజలు హర్షించరని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కోర్టు తీర్పుపై కేటీఆర్ చేసిన ట్వీట్‌లో లిక్కర్ కేసు కారణంగానే పార్టీ ఓడిపోయినట్లు రాశారని.. బీఆర్ఎస్ ఓటమిని తన మెడలో వేయొద్దని.. అలా చేయాలని చూస్తే ప్రజలు హర్షించరని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం బీఆర్‌కే భవన్‌లో రైతుల సమస్యలపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుపై మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాలు, ఇళ్లు ఇవ్వకపోవటం.. దోపిడీదారులకు టికెట్లు ఇవ్వడం.. అహంకారం కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. ఒకవైపు కంగ్రాట్స్ చెబుతూనే.. మరోవైపు పార్టీ ఓటమికి ఈ కేసే కారణమనేలా ట్వీట్ చేశారన్నారు. ఈ కేసు వల్లే ఓడిపోయినట్లు అడ్డమైన రాతలను సోషల్ మీడియాలో రాస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ కేసు పెట్టింది బీఆర్ఎస్‌పై కక్ష సాధింపు కోసం కాదా అని ప్రశ్నించారు. తాను జైలుకు వెళ్లాక కేసీఆర్, కేటీఆర్ సహా పెద్ద నాయకులెవరూ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని ప్రశ్నించారు.
ప్రజా తీర్పును శిరసావహించా...
అత్యంత పవిత్రంగా తొమ్మిది రోజులు అన్నం తినకుండా బతుకమ్మ ఎత్తుకొని జాతి సంస్కృతిని తెలిపిన బిడ్డనని.. అలాంటిది బతుకమ్మ ప్లేస్‌లో లిక్కర్ బాటిల్ ఎత్తుకున్నట్లు బీజేపీ సోషల్ మీడియా తనను అవమానిస్తుంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎక్కడికి పోయిందని నిలదీశారు. ఆనాడే అలాంటి తప్పుడు ప్రచారాలను ఎదుర్కొంటే బీఆర్ఎస్‌కు ఈ గతి పట్టేదా అని ప్రశ్నించారు. నిజామాబాద్‌లో తాను ఓడిపోయినప్పుడు కూడా ప్రజా తీర్పును శిరసావహించానని.. కారణాలు వెతకలేదని అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీలో ఎన్నికలు జరిగాయని.. తెలంగాణలో మాత్రం అసెంబ్లీ ఎన్నికల తర్వాతే తాను అరెస్ట్ అయ్యానని వెల్లడించారు. ఇప్పటికైనా కేటీఆర్ వాస్తవాలు అంగీకరించి నిజాలు మాట్లాడాలని సూచించారు. ఎక్సైజ్ పాలసీ కేసు సమయంలోనూ పార్టీ, పార్టీ సోషల్ మీడియా తనకు సపోర్ట్‌గా లేదన్నారు. బీజేపీ చేసిన తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడంలో విఫలమైందని ఆరోపించారు. ఆ రెండు పార్టీలూ ఒక్కటేనని ఆరోపించారు. పార్టీ పెట్టనున్న రెండు నెలల ముందు ఈ తీర్పు రావటమంటే ప్రకృతి ఆశీర్వాదం ఇచ్చినట్లేనని వెల్లడించారు. తనకు బీఆర్ఎస్ లాగా సోషల్ ఆర్మీ లేదని.. ఇక్కడున్న పిడికెడు మందితోనే తాను ప్రజల పక్షాన పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఒక ఆడబిడ్డ కష్టంలో ఉన్నప్పుడు అడ్డమైన టైటిల్స్ పెట్టిన అడ్డగాడిదలకు తగిన సమయంలో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.
కడిగిన ముత్యంలా బయటకు వచ్చా..
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు తప్పుడు కేసు అని ఎప్పటి నుంచో చెబుతున్నానని.. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అన్నానని.. కోర్టు తీర్పుతో అదే జరిగిందని కవిత అన్నారు. కానీ.. ఐదున్నర నెలలు కుటుంబానికి దూరం ఉన్నానని.. అవమానాలు, బాధ, వ్యక్తిత్వ హననం ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ అవమానం తీరదని.. తమ కుటుంబానికి సైతం అన్యాయం జరిగిందని అన్నారు. కష్టసమయంలో అండగా నిలిచిన తల్లిదండ్రులకు, అత్తామామలకు, భర్తతోపాటు ఆయన కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ తప్పుడు కేసును కొట్టి వేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుకు భారత న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసులో ఆర్గ్యూమెంట్సే ఫాల్స్ అని కోర్టు స్పష్టం చేసిందని.. కేసులో ఉన్న వారందరికీ క్లీన్ చిట్ ఇవ్వడం సంతోషకరమన్నారు. కేసు ప్రతీ హియరింగ్‌కు ఇక్కడున్న కార్యకర్తలే వచ్చి తనకు నైతిక స్థైర్యం ఇచ్చారని తెలిపారు. తాను ప్రజాసేవ చేసేందుకు ఈ కేసులు ఏ మాత్రం అడ్డంకావని అన్నారు.






