చరిత్ర తిరగ రాయాల్సిన సమయం ఆసన్నమైంది: కవిత

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-04 10:47:25  IST  )

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

చరిత్ర తిరగ రాయాల్సిన సమయం ఆసన్నమైంది: కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ ఫలితాలు దేశ రాజకీయాల్లో ఒక కొత్త మార్పుకు సంకేతమని ఆమె అభిప్రాయపడ్డారు. తమిళ ప్రజలు పంపిన ఈ సంకేతం కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాదని, దేశమంతటా దీని ప్రభావం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. "ఉన్న రాజకీయ నాయకులతో, పాత పద్ధతులతో ప్రజలు విసిగిపోయారు. కేవలం అధికార దాహంతో పని చేసే నాయకులను చూసి వేసారిపోయారు. భ్రష్టుపట్టిపోయిన ఈ రాజకీయ చరిత్రను తిరగ రాయాల్సిన సమయం ఆసన్నమైంది" అని ఆమె వ్యాఖ్యానించారు.

కొత్త శక్తుల అవసరం..

నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ సాధిస్తున్న ఆధిక్యాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. "కొత్త రాజకీయ శక్తులు" రావాలని దేశానికి తమిళ ప్రజలు ఒక స్పష్టమైన సందేశం పంపారని ఆమె అన్నారు. మార్పును ఆకాంక్షించే శక్తులకు ఈ ఫలితాలు పెద్ద ఊతాన్నిస్తాయని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. పాత రాజకీయ శక్తులపై ప్రజల్లో ఉన్న అసహనాన్ని ఆమె ఎత్తిచూపారు. కొత్త తరం నాయకత్వం, విభిన్నమైన రాజకీయ ఆలోచనలు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాగా, తమిళనాడు ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల ఉనికిని, కొత్త పార్టీల అవసరాన్ని గుర్తు చేస్తున్నాయని విశ్లేషించారు. తెలంగాణలో కూడా తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్న కవిత, తమిళనాడు ఫలితాలను ఉదహరిస్తూ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Next Story