- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే నిరాహార దీక్ష చేస్తా: కవిత హెచ్చరిక
ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు, వారి తల్లిదండ్రుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే నిరాహార దీక్షకు దిగుతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు, వారి తల్లిదండ్రుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే నిరాహార దీక్షకు దిగుతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బోయిన్‌పల్లి మనో వికాస్ నగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీస్ (ఎన్ఐఈపీఐడీ)లో శిక్షణ పొందుతున్న ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు, వారి తల్లిదండ్రులతో కవిత సమావేశం అయ్యారు. ఇటీవల ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా ఎన్ఐఈపీఐడీని సందర్శించిన కవిత.. శనివారం జాగృతి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో చిన్నారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మానసిక పరిపక్వత తక్కువగా ఉన్న పిల్లలకు ఏ ప్రభుత్వం వచ్చినా సరైన మేలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మానసిక ఎదుగుదల తక్కువగా ఉన్న వారిని గతంలో దివ్యాంగులుగా పరిగణించలేదని, అయితే పార్లమెంట్‌లో పోరాటం చేసి 21 రకాల సమస్యలు ఉన్న వారిని దివ్యాంగులుగా గుర్తింపునిచ్చేలా చేశామని తెలిపారు.
తెలంగాణలో దివ్యాంగుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యం కల్పించేలా తానే పోరాటం చేసి జీవో తీసుకొచ్చినప్పటికీ, అది సరిగ్గా అమలు కావడం లేదని కవిత విమర్శించారు. మానసిక ఎదుగుదల తక్కువగా ఉన్న పిల్లల తల్లిదండ్రుల బాధలు తనకు తెలుసని, వారికి ఇళ్లు కూడా అద్దెకు దొరకని పరిస్థితి ఉందన్నారు. అందుకే వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్యతో బాధపడుతున్న వారు దాదాపు లక్ష మంది వరకు ఉంటారని, వారందరికీ పెన్షన్ ఇవ్వగలిగే స్థితిలో ప్రభుత్వం ఉందని కవిత అన్నారు. ప్రతి ప్రభుత్వ పథకంలో మెంటల్లీ, ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే భర్త చనిపోయిన మహిళలు, ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ల విషయంలో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ అంశాలపై ముందుగా ప్రభుత్వానికి లేఖలు రాసి నెల రోజుల గడువు ఇస్తామని, ఆలోపు స్పందించకపోతే తానే నిరాహార దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. ‘మీ తరఫున నేను పోరాటం చేస్తా. మీకు ఇబ్బంది లేకుండా చూడటం ప్రజాప్రతినిధుల బాధ్యత’ అని ఆమె అన్నారు. దివ్యాంగులు, మెంటల్లీ ఛాలెంజ్ పిల్లలను అవమానించకుండా గౌరవించే విధంగా ప్రభుత్వం విధానాలు రూపొందించాలని, స్పైనల్ డిసెబిలిటీ ఉన్న వారిని కూడా పెన్షన్లలో చేర్చాలని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు పెన్షన్లు, ఇళ్లు ఇచ్చే అంశాలపై పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.






