ఆ భూములను తిరిగి ఇచ్చేయాలి: కవిత

by Gantepaka Srikanth |

ఫార్మా సిటీ రైతుల పక్షాన రణం చేస్తామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను వెంటనే రైతులకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.

ఆ భూములను తిరిగి ఇచ్చేయాలి: కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్మా సిటీ రైతుల పక్షాన రణం చేస్తామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను వెంటనే రైతులకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘ఫార్మా సిటీలో ఏం జరుగుతోంది’ అనే అంశంపై గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫార్మా సిటీ భూసేకరణ కోసం తెచ్చిన జీవో 31ను రద్దు చేయాలన్నారు. ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో రైతులను ఆగం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఫార్మాసిటీ భూముల విషయంలో గత ప్రభుత్వం నిస్సిగ్గుగా అబద్ధాలు చెబితే.. అవే అబద్ధాలను ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని మండిపడ్డారు. నిజం చెప్పే దమ్ము ఈ ప్రభుత్వాలకు లేదన్నారు. సేకరించిన భూములను రైతులకు వెంటనే ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. రైతుల అంగీకారం లేకుండానే వారి భూములను సేకరించారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఫార్మాసిటీ లో భూముల సేకరణ కోసం జీవో 31 తీసుకొచ్చిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక రైతుల మోసం చేసిందన్నారు. జీవో 31 రద్దు చేయకపోగా ఫ్యూచర్ సిటీ పేరుతో భూ సేకరణను 13,500 ఎకరాల నుంచి 30 వేల ఎకరాలు చేశారన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ సర్కార్ ప్రజలందరినీ మోసం చేస్తున్నదని మండిపడ్డారు. బుల్లెట్ ట్రైన్ వస్తున్నదని, 6 లక్షల కోట్ల ఎంఓయూలు, డేటా సెంటర్లు అంటూ అబద్ధాల పునాదుల మీద ప్యూచర్ సిటీ నిర్మాణం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. డేటా సెంటర్ల పేరుతో ప్రజలను కాలుష్యం కోరల్లోకి నెట్టేస్తారా అని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీపై ఫోకస్ పెడితే హైదరాబాద్ కోర్ సిటీ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని సూచించారు. సమస్యలు తీరాలంటే పోరాటమే శరణ్యమని కవిత అన్నారు. వేరే పార్టీల సంగతి ఎలా ఉన్నా.. తాము మాత్రం ఫార్మా సిటీ రైతుల కోసం ముందుండి కొట్లాడతామని ప్రకటించారు. ప్రశ్నించటం, పోరాడటం, పరిష్కరించడం తమ విధానమని చెప్పారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.

Next Story