తెలంగాణ తల్లి విగ్రహంపై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిపక్షాలుగా విఫలమయ్యాయని.. అందుకే కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండానే ఎక్కువ స్థానాలు గెలుచుకున్నదని.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను తామే పోషిస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

తెలంగాణ తల్లి విగ్రహంపై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిపక్షాలుగా విఫలమయ్యాయని.. అందుకే కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండానే ఎక్కువ స్థానాలు గెలుచుకున్నదని.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను తామే పోషిస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఐమాక్స్ ఎదురుగా ఉన్న లేక్ వ్యూ పార్క్‌లో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటు పనులను శుక్రవారం కవిత పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజలు ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వలేదని.. అన్ని పార్టీలను వ్యతిరేకిస్తున్నారని.. హంగ్ వచ్చిన చోట కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. అలాగే.. రెండున్నరేళ్లుగా ఫూలే విగ్రహం అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని జాగృతి పోరాటం చేస్తున్నదని.. తమ వరుస పోరాటాల ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చిందని చెప్పారు. ట్యాంక్ బండ్ మీద విగ్రహం ఏర్పాటు చేయడం పాక్షిక విజయమేనని.. అసెంబ్లీలోనూ ఉండాలన్నది తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనిచేయకపోతే జాగృతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తప్పకుండా ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక్క ఫూలే విగ్రహం మాత్రమే పెడుతారా.. సాయిత్రి బాయితో కలిపి విగ్రహం ఏర్పాటు చేస్తారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదన్నారు. అలాగే.. బీసీ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. మున్సిపల్ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించలేదని.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనైనా 42 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

ఆ విగ్రహం తెలంగాణ తల్లిది కాదు..

బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లులకు ఆమోదం లభించేలా ప్రధాని మోడీపై సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడి పెంచాలన్నారు. విద్యార్థులను పరీక్షలను కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం వరుస ఎన్నికలు నిర్వహిస్తున్నదని ఆరోపించారు. బడ్జెట్‌లో ఏటా బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు. బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లి కాదని.. ప్రభుత్వం పెట్టే కాంగ్రెస్ తల్లి బొమ్మకు ప్రజల ఆమోదం లభించదని.. బలవంతంగా ఒక ప్రతీకను ప్రజల మీద రుద్దే ఏ ప్రభుత్వాన్ని ప్రజలు హర్షించరని హెచ్చరించారు. మరోవైపు.. కార్పొరేషన్ల పదవులు కూడా అగ్రకులాల వారికే ఇస్తున్నారని.. ఎన్నికల్లో గెలవలేని బీసీ, మహిళ, మైనార్టీలకు కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని.. ప్రభుత్వం స్థలం ఇస్తే విగ్రహ ఏర్పాటుతోపాటు నిర్వహణకు అయ్యే ఖర్చు జాగృతి భరిస్తుందని చెప్పారు. స్థలం కేటాయించాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరామని.. ఫూలే జయంతి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సైతం కోరుతామని స్పష్టం చేశారు.

Next Story