నర్సులకు కనీస వేతనం రూ.20వేలు అమలు చేయాలి: కల్వకుంట్ల కవిత

by Ajay Maddhiboyina |

క్రెడిట్ పాయింట్ల పేరుతో నర్సింగ్ సిబ్బందిని వేధింపులకు గురిచేయొద్దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. క్వాలిఫైడ్ నర్స్‌ల రిజిస్ట్రేషన్ రెన్యూవల్‌కు ఐదేళ్లలో 150 క్రెడిట్ పాయింట్లు సాధించి ఉండాలని కొర్రీలు పెట్టడం సరికాదని పేర్కొన్నారు.

నర్సులకు కనీస వేతనం రూ.20వేలు అమలు చేయాలి: కల్వకుంట్ల కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో: క్రెడిట్ పాయింట్ల పేరుతో నర్సింగ్ సిబ్బందిని వేధింపులకు గురిచేయొద్దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. క్వాలిఫైడ్ నర్స్‌ల రిజిస్ట్రేషన్ రెన్యూవల్‌కు ఐదేళ్లలో 150 క్రెడిట్ పాయింట్లు సాధించి ఉండాలని కొర్రీలు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఈ నిబంధనలు తెచ్చిన తర్వాత తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ వాటిపై కనీస అవగాహన కల్పించే ప్రయత్నాలు చేయలేదని గుర్తుచేశారు.

తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో 80వేల మంది నర్సింగ్ సిబ్బంది తమ రిజిస్ట్రేషన్ల రెన్యూవల్‌కు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. క్వాలిఫైడ్ నర్సులు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడానికి ఐదేళ్లలో 150 గంటల కంటిన్యూయింగ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ క్రెడిట్ అవర్స్ కలిగి ఉండాలనే నిబంధన తెచ్చినట్టు చాలా మందికి అవగాహన లేదని తెలిపారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ తెచ్చిన ఈ కొత్త నిబంధనపై తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ అవగాహన కల్పించలేదని నర్సింగ్ సిబ్బంది వాపోయారని తెలిపారు.

150 రిజిస్ట్రేషన్లు రెన్యూవల్ చేస్తామంటూ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ ఉత్తర్వులు ఇవ్వడం పూర్తిగా ఏకపక్షమేనని పేర్కొన్నారు. ఉద్యోగాలు చేస్తూ నర్సింగ్ సిబ్బంది నెలకు కనీసం రెండు కాన్ఫరెన్స్‌లకు హాజరయితే తప్ప నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల మేరకు క్రెడిట్ పాయింట్స్ సాధించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ విధానంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. అలాగే.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సులకు కనీస వేతనం రూ.20 వేలు అమలు చేస్తూ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. నర్సింగ్ సిబ్బందిపై వేధింపులు ఆపకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Next Story