ఎవరెన్ని అన్నా.. ‘రాష్ట్రాన్ని అమ్మలా లాలించి పాలన అందిస్తా’.. విమర్శలకు కవిత కౌంటర్

by Gantepaka Srikanth |

తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త రాజకీయ శక్తిగా 'తెలంగాణ రక్షణ సేన' (TRS) ఆవిర్భవించిందని, అన్ని వర్గాల రక్షణే ధ్యేయంగా ఈ వేదిక పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

ఎవరెన్ని అన్నా.. ‘రాష్ట్రాన్ని అమ్మలా లాలించి పాలన అందిస్తా’.. విమర్శలకు కవిత కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త రాజకీయ శక్తిగా 'తెలంగాణ రక్షణ సేన' (TRS) ఆవిర్భవించిందని, అన్ని వర్గాల రక్షణే ధ్యేయంగా ఈ వేదిక పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో 'సర్వోదయ తెలంగాణ' లక్ష్యంగా తమ పార్టీ ప్రయాణం సాగుతుందని స్పష్టం చేశారు. శ్రీకృష్ణుడు అధర్మంపై యుద్ధం చేసేందుకు మోగించిన యుద్ధభేరి 'పాంచజన్యం' స్ఫూర్తితో.. ఐదు ప్రధాన అంశాలతో తమ మేనిఫెస్టోను రూపొందించినట్లు కవిత వెల్లడించారు. ఈ ఐదు అంశాలే తమ పార్టీకి ప్రాణవాయువు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 75 శాతం మంది ప్రైవేట్ విద్యపైనే ఆధారపడుతున్నారని, సామాన్యుడి ఆదాయంలో 60 శాతం విద్య, వైద్యానికే ఖర్చవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రైవేట్ పాఠశాలల్లో చదివే వారికి కూడా వారు ఎంత వరకు చదువుతారో అంత వరకు పూర్తి ఉచిత విద్యను అందిస్తామని, దీనికి సంబంధించిన అన్ని ఆర్థిక లెక్కలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

ఎంత ఖర్చైనా వెనకాడబోం..

క్యాన్సర్ వంటి మహమ్మారి సోకితే రూ. 3 లక్షలు లేక ప్రాణాలు వదులుకుంటున్న కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయని కవిత అన్నారు. లైఫ్ స్పాన్ పెరగాల్సిన సమయంలో సరైన వైద్యం అందకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం వచ్చాక ఎంత ఖర్చైనా సరే, ప్రభుత్వమే భరించి ప్రతి బిడ్డకు నాణ్యమైన వైద్యం అందిస్తుందని హామీ ఇచ్చారు. రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద ప్రాణాలు వదులుతున్నారని, మక్కా కుప్పపైనే రైతు చనిపోయిన ఘటన తనను కలచివేసిందని కవిత అన్నారు. ధాన్యం ఎగుమతి (Export) చేసేందుకు ప్రత్యేక కమిటీ వేసి రైతులకు మద్దతు ధరతో పాటు ఆత్మగౌరవాన్ని కల్పిస్తామన్నారు. యువత కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడటం కాదని, ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని ఆమె పిలుపునిచ్చారు. 18-45 ఏళ్ల లోపు యువతకు వారి ఐడియాలజీ ఆధారంగా రూ. 2 లక్షల నుంచి రూ. 20 కోట్ల వరకు రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. మన రాష్ట్రం నుంచి గూగుల్, వాట్సాప్ వంటి సంస్థలు రావాలన్నదే తమ ఆశయమని చెప్పారు. అలాగే, 4 లక్షల ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.

‘అమ్మ’ లాంటి పాలన..

ప్రస్తుత ప్రభుత్వాలకు అమ్మలా ఆలోచించే విధానం లేదని కవిత విమర్శించారు. సచివాలయంలో వికలాంగులకు ర్యాంప్ లేకపోవడం, బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇవ్వకపోవడం వంటివి ప్రభుత్వ వైఫల్యాలన్నారు. పేదలు, వికలాంగులు, మాజీ మావోయిస్టులు, ఆర్మీ జవాన్లు.. ఇలా అన్ని వర్గాలకు మేలు చేయడమే సామాజిక న్యాయమని, తెలంగాణ రక్షణ సేన అమ్మలా లాలించి పాలన అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా తెలంగాణ సంస్కృతి కోసం పనిచేసిన 'తెలంగాణ జాగృతి' ఒక స్వచ్ఛంద సంస్థగా అలాగే కొనసాగుతుందని, రాజకీయాలకు 'తెలంగాణ రక్షణ సేన' వేదికగా ఉంటుందని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పని వ్యక్తిగా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సిద్ధమని కవిత తన ప్రసంగాన్ని ముగించారు.

‘నేను అమ్మలా పరిణితి చెందుతానని అంటే చాలా మంది ఎలా అవుతారని ప్రశ్నించారు. కానీ అమ్మలాంటి పాలన చేసినప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయం చేయగలుగుతాం. కచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వాలకు అమ్మలా ఆలోచన చేసే విధానం లేదు. నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు అక్కడకు ఓ వికలాంగుడు వస్తే ఆయనను సర్టిఫికెట్ తేవాలని కలెక్టర్ అడిగిండు. కళ్లముందు వికలాంగుడిగా కనిపిస్తున్న వ్యక్తికి సర్టిఫికెట్ ఎందుకు?. మనం అంత పెద్ద సచివాలయం కడితే ర్యాంప్ లేదు, బాత్ రూమ్ లేదు. ఈ ప్రభుత్వం కనీసం వికలాంగులకు ఫ్రీ బస్ ఎందుకు ఇవ్వటం లేదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో వికలాంగులకు కో-ఆప్షన్ మెంబర్ ఇస్తామని ప్రకటించింది. మరి ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కనీసం ఆర్టీసీ బస్సుల్లో కూడా వికలాంగులకు ఉచిత ప్రయాణం ఇవ్వటం లేదు. కచ్చితంగా ఈ ప్రభుత్వంలో అమ్మ లాలనతో పాలన జరగటం లేదు. మేము ఆ దిశగా ప్రయాణం చేస్తాం’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story