ప్రభుత్వాలు మారుతున్నా ఉప్పల్ పరిస్థితి మారట్లేదు.. కవిత కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల ఆలస్యానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ..

ప్రభుత్వాలు మారుతున్నా ఉప్పల్ పరిస్థితి మారట్లేదు.. కవిత కీలక వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల ఆలస్యానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉప్పల్ ఫ్లై ఓవర్ ను 8 ఏళ్లుగా కడుతూనే ఉన్నారని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితి మారటం లేదని విమ‌ర్శించారు. ఈ అంశంపై తాను శాసన మండలిలో ప్రశ్నిస్తే...మంత్రి కోమటి రెడ్డి స్పందించారని త్వరలోనే సమీక్ష చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు.

ఆ తర్వాత కాంట్రాక్టర్ ను మార్చారో లేదో తెలియదు కానీ ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ఉందన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తేవటానికి ఇక్కడకు వచ్చామ‌ని చెప్పారు. ఘట్కేసర్ వరకు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారని అన్నారు. 8 ఏళ్లుగా కడుతున్నారంటే ప్రజల పట్ల ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ది ఉందో తెలుస్తోందని ఎద్దేవా చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కో ఆర్డినేషన్ లేకపోవటం కారణంగానే ఆలస్యమవుతోందని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు పూర్తి చేయించాలని కోరారు. ఈ ప్రాంత ఎంపీ ఈటల రాజేందర్ ఇక్కడకు వచ్చి పరిస్థితిని చూడాలన్నారు. సెంట్రల్ ప్రాజెక్ట్ కనుక బీజేపీ ఎంపీ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడకు వచ్చి నిరసన తెలిపి వెంటపడి పనులు చేయించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, లేదంటే మా సంస్థ తరఫున మేమే ప్రభుత్వం వెంట పడి పనులు చేయిస్తామ‌ని వ్యాఖ్యానించారు.

Next Story