తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలి

by Ratna Kumari |

దేవరకొండ నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ రాష్ట్ర మంత్రులను కోరారు.

తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలి
X

దిశ, దేవరకొండ టౌన్ : దేవరకొండ నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ రాష్ట్ర మంత్రులను కోరారు. నల్లగొండలో "ఎల్‌నినో ప్రభావం–సంసిద్ధత, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం" అంశంపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే, నియోజకవర్గంలోని తాగునీరు, సాగునీటి సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు నిరంతరాయంగా సురక్షితమైన తాగునీటిని అందించేందుకు అవసరమైన మౌలిక వసతులను తక్షణమే కల్పించాలని ఆయన కోరారు. ముఖ్యంగా పెండ్లిపాకల 7 ఎంఎల్‌డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో ఇటీవల మరమ్మతులు చేసిన 33/415 ట్రాన్స్‌ఫార్మర్‌కు అదనంగా మరో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బాట్లపల్లి పంప్‌హౌస్‌లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా అదనపు మోటార్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ రెండు ప్రతిపాదనలు అమలైతే నియోజకవర్గంలో తాగునీటి సరఫరా మరింత మెరుగుపడుతుందని వివరించారు.

డిండి ప్రాజెక్టులో ప్రస్తుతం తగినంత నీటి నిల్వలు ఉన్న నేపథ్యంలో వానాకాలం పంటలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీటిని విడుదల చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, రైతులకు నిరంతరాయంగా సాగునీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి (ప్రత్యామ్నాయ) పంటలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ పంటలను ఎంపిక చేసుకుంటే నష్టాలను నివారించవచ్చన్నారు. ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తెలిపారు.

Next Story