- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు లభించిన భారీ ఊరట: బహదూర్‌గూడ భూములపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్ గూడ భూముల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్ గూడ భూముల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేస్తూ పిటిషన్ వేసిన నలుగురు రైతులకు భారీ ఊరటనిచ్చింది. బహదూర్ గూడలోని సర్వే నంబర్లు 3, 4 పరిధిలో ఉన్న 28 ఎకరాల భూమి తమదేనని, గత 30 ఏళ్లుగా తాము ఈ భూముల్లో సాగు చేసుకుంటున్నామని పేర్కొంటూ నలుగురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున లాయర్లు వినిపించిన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, ఆ భూములకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఏజీ సుదర్శన్ రెడ్డి వాదన..
మరోవైపు ఈ కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (AG) సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ పక్షాన బలమైన వాదనలు వినిపించారు. బహదూర్ గూడలోని ఆ భూములు పిటిషనర్లవి కావని కోర్టుకు తెలిపారు. రైతులు చూపిస్తున్న పట్టదారు పాస్ పుస్తకాలపై ఎలాంటి అధికారుల సంతకాలు లేవని ఏజీ స్పష్టం చేశారు. ప్రభుత్వం కేవలం సర్వే నంబర్లు 28, 62 పరిధిలోని ప్రభుత్వ భూములకు మాత్రమే ఫెన్సింగ్ వేసిందని వివరించారు. పిటిషనర్లు పేర్కొంటున్న సర్వే నంబర్లు 3, 4లలోని భూముల జోలికి ప్రభుత్వం గానీ, అధికారులు గానీ వెళ్లలేదని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కేసు నేపథ్యం..
శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని బహదూర్ గూడ గ్రామంలో ఉన్న భూముల స్వాధీనం, ఫెన్సింగ్ వ్యవహారం గడిచిన కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని ఆరోపిస్తూ స్థానిక రైతులు గత కొద్దిరోజులుగా అక్కడ నిరసన దీక్ష చేపట్టారు. అయితే, పోలీసు బందోబస్తుతో అధికారులు/హైడ్రా శనివారం వేకువజామున రంగప్రవేశం చేసి దీక్షా శిబిరాన్ని తొలగించి ఫెన్సింగ్ వేసేందుకు యత్నించింది. ఈ క్రమంలో అధికారులకు, స్థానిక రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులు ప్రతిఘటించడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు స్థానిక రైతులు, బీఆర్ఎస్, భాజపా నేతలతో పాటు సుమారు 36 మందిపై కేసులు నమోదు చేశారు. ఒకవైపు ఆందోళనలు జరుగుతుండగానే, తమ ఆధీనంలో ఉన్న సర్వే నెంబర్లు 3, 4 భూములను కాపాడుకునేందుకు బాధితులుగా భావిస్తున్న నలుగురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తమ 30 ఏళ్ల సాగు హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాలని విజ్ఞప్తి చేయడంతో హైకోర్టు స్పందించి ప్రస్తుత స్టే/మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.






