బ్యాక్ డోర్‌లో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి కుట్రలు: కల్వకుంట్ల కవిత

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిరుద్యోగ యువత నోట్లో మట్టికొందని, బ్యాక్​డోర్​లో బ్యాక్​లాగ్​నియమాకాలు చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విరుచుక పడ్డారు.

బ్యాక్ డోర్‌లో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి కుట్రలు: కల్వకుంట్ల కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిరుద్యోగ యువత నోట్లో మట్టికొందని, బ్యాక్​డోర్​లో బ్యాక్​లాగ్​నియమాకాలు చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విరుచుక పడ్డారు. మున్సిపల్​, రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్​శాఖల్లో దొడ్డిదారిన ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. నిరుద్యోగం యువత ప్రభుత్వం ఎప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్స్ వేస్తుందా అని ఎదురుచూస్తున్నారని సర్కార్​కొలువుల కోసం గ్రామాల నుంచి ఎంతో మంది యువకులు హైదరాబాద్ వచ్చి శిక్షణ పొందుతూ వేల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని యువత ఉద్యమంలో బలంగా కొట్లాడితే తెలంగాణ వచ్చాక చిన్నపాటి ఉద్యోగాలు తప్ప పెద్ద పోస్టుల భర్తీ జరగలేదన్నారు. ఒక క్రమపద్దతిలో పరీక్షలు నిర్వహించలేదని, ఒకే విద్యార్థి రకరకాల ఉద్యోగాలకు పరీక్ష రాయకుండా ఒకే రోజు రెండు పరీక్షలు నిర్వహించారు.

ఆగ్రహం చెందిన యువత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపితే న్యాయం జరుగుతుందని భావించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో యువత గ్రామాల్లో తిరిగి ఓటర్ల కాళ్లు పట్టుకొని కాంగ్రెస్ కు ఓటు వేయించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ వస్తుందని నమ్మారు. ఏ నెలలో ఏ జాబ్ వస్తుందో కూడా స్పష్టత లేని పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు స్టేట్ లెవల్ పోస్టులను కూడా ప్రొవిజన్ అనే చిన్నపదాన్ని పట్టుకొని పరీక్షలు లేకుండానే ఉద్యోగం ఇచ్చారు. లక్షన్నర జీతం ఉన్న ఉద్యోగాలను బోయినపల్లి సరితతో పాటు చాలా మందికి వచ్చినట్లు ప్రచారం జరిగిందన్నారు. నిర్మల్ లో కూడా జిల్లా స్థాయిలో ఉన్న 44 పోస్టులను రూ. 10 నుంచి 15 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. దీనిపై యువత పోరాటం చేస్తే ఆ నియమాకాలను నిలిపివేశారు. అప్పుడు కాంట్రాక్ట్ పద్దతిలో చేరిన వాళ్లు ఇంకా ఉన్నారని వాళ్లకు న్యాయం జరగలేదు.

అప్పటి బీఆర్ఎస్ నాయకులే ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నారు. రాజకీయాలను యువత కచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ నిర్మల్ సహా చాలా జిల్లాల నుంచి యువత మా వద్దకు వచ్చి తమ ఆవేదన చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో పోస్టులు అమ్ముకున్న విషయం కొన్ని చోట్ల రుజువైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే జరిగే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ముందే కళ్లు తెరిచి అధికారులకు గట్టిగా హెచ్చరికలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ పరిధిలో ఉండే ఈ ఉద్యోగాలను కలెక్టర్లు మెరిట్ ఉన్న అభ్యర్థులకే దక్కేలా చేయాలని, డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకునే ప్రయత్నం ఎవరు చేయవద్దని, తాము అధికారంలోకి వస్తే డబ్బులు తీసుకున్న, ఇచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అడ్డదారిలో ఉద్యోగాలు తెచ్చుకునే ప్రయత్నం చేయకుండా మెరిట్ ఉన్న వాళ్లకు అవకాశం రానివ్వాలి. మెరిట్ తో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి జాగృతి అండగా ఉంటుంది. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే ప్రత్యేక దృష్టి పెట్టి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

Next Story