కల్వకుంట్లదే ‘తొలివెలుగు’! జర్నలిస్ట్ రఘు సంచలన ఆరోపణలు

by Disha Web Desk 4 |
కల్వకుంట్లదే ‘తొలివెలుగు’! జర్నలిస్ట్ రఘు సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తొలివెలుగు యూట్యూబ్ ఛానల్ నుంచి జర్నలిస్ట్ రఘు బయటకు వచ్చారు. తొలివెలుగుతో తన బంధం తెగిపోయిందని, నోట్ల కట్టలు, భూములు ఈ బంధాన్ని తెంచివేశాయంటూ రఘు ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన రవిప్రకాశ్‌తో పాటు మంత్రి కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. రవి ప్రకాశ్ కేసీఆర్ కుటుంబానికి రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తున్నాడని ఆయన తొలివెలుగును కేసీఆర్ కుటుంబం ముందు పెట్టాడని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ఫేస్ టైమ్ ద్వారా తనకు ఫోన్ చేసి డబ్బులు, భూములు ఇస్తానని ఆఫర్ చేస్తే తాను సున్నితంగా రిజెక్ట్ చేసిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు.

తన పిల్లల మీద ప్రమాణం చేసి ఈ మాట చెబుతున్నానని కేటీఆర్‌తో కాల్ చేయించలేదని రవి ప్రకాశ్ ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. ధరణి, మైహోం రామేశ్వర్ రావు, టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్స్, నిరుద్యోగులపై మాట్లాడిన వీడియోలు, ప్రొఫెసర్ కాశీం, తీన్మార్ మల్లన్న, బక్క జడ్సన్, పృథ్వీరాజ్ వంటి వారు మాట్లాడిన ఇంటర్వ్యూలు ఎందుకు తొలివెలుగు ఛానెల్‌లో ప్రైవేట్‌లో ఉంచారని ప్రశ్నించారు. 183 వీడియోలు ఇవాళ ప్రైవేట్‌లో ఉంచారని ఇది జీర్ణించుకోలేకే తను బయటకు వచ్చానన్నారు.

తొలివెలుగు ఎవరి పేరు మీద ఉందో రాత్రికి రాత్రే బ్యాంక్ అకౌంట్లు అన్ని రాత్రికి రాత్రే రవి ప్రకాశ్ తన పేరు మీదకు మార్చుకున్నది అవునా కాదా అని ప్రశ్నించారు. తాను రూ.5 కోట్లు అడిగానని దుష్ప్రచారం జరుగుతోందని తాను చాలా ఓపెన్‌గా చెబుతున్నానని తన వాటా ఎంతో తేల్చాలని అడిగానన్నారు. ఈ సంస్థను అభివృద్ధి చేసేందుకు తాను జైలుకు సైతం వెళ్లివచ్చానని అన్నారు. ఇన్నాళ్లు ధరణి లోపాలపై మాట్లాడిన తాను ఇకపై ధరణి గొప్పది అని మాట్లాడమంటారా అని ప్రశ్నించారు. నిన్న నేను చేసిన మార్నింగ్ న్యూస్‌ను కూడా డిలీట్ చేయించారని ఆరోపించారు. తాను ఓ బీసీ బిడ్డను కాబట్టే ఏమి చేయలేననే తన పట్ల ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు. తనకు తన కుటుంబానికి ఏదైనా జరిగితే కేటీఆర్, రవి ప్రకాశ్‌దే బాధ్యత అన్నారు. మరో రెండు రోజుల్లో తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని వెల్లడించారు.

తొలివెలుగు వివరణ..

రఘు ఆరోపణల నేపథ్యంలో తొలివెలుగు ఛానెల్ ఓ వీడియోను పోస్టు చేసింది. గత రెండు నెలలుగా తొలివెలుగు అమ్ముడు పోయిందనే విష ప్రచారం జరుగుతోందని ఈ ప్రచారం వెనుక రఘు ఉన్నాడనే అనుమానం వ్యక్తం చేసింది. తొలి వెలుగును రఘు రూ.5 కోట్లు డిమాండ్ చేసింది నిజం కాదా అని సవాల్ విసిరింది. ఒక వేళ ఇది నిజం అని తేలితే దేనికి సిద్ధమో రఘు చెప్పాలని ఈ వీడియోలో డిమాండ్ చేశారు. తొలివెలుగు అమ్ముడు పోయే సంత సరుకు కాదని రఘు వెనుక కొన్ని షాడో శక్తులు ఉన్నాయని అవి చివరకు రఘు మేనేజ్ మెంట్‌ను బెదిరించే స్థాయికి చేరాయని ఈ వీడియోలో పేర్కొంది. లీగల్‌గా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే వీడియోలు మాత్రమే ప్రైవేట్‌లోకి వెళ్లాయని మిగతా వీడియోలు అన్ని అలానే ఉన్నాయని వివరణ ఇచ్చారు.


Next Story

Most Viewed