PC Ghose commission: కాళేశ్వరం విచారణలో కీలక పరిణామం.. ఆ సీనియర్ ఐఏఎస్ కు కమిషన్ నోటీసులు

by Prasad Jukanti |

కాళేశ్వరం విచారణ తుది దశకు చేరుకుంది. ఓ వైపు విచారణ జరుపుతూనే కమిషన్ మరో వైపు రిపోర్టు సిద్ధం చేస్తోంది.

PC Ghose commission: కాళేశ్వరం విచారణలో కీలక పరిణామం.. ఆ సీనియర్ ఐఏఎస్ కు కమిషన్ నోటీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission) విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు ఇంజినీర్లు, ఉన్నతాధికారులను ప్రశ్నించిన కమిషన్ తాజాగా తెలంగాణ అర్థిక శాఖ కార్యదర్శిగా పని చేసిన ఐఏఎస్ రామకృష్ణారావుకు (IAS Ramakrishna Rao) ఇవాళ నోటీసులు జారీ చేసింది. అలాగే , వాటర్ రిసోర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేసిన వి.ప్రకాశ్‌ (V. Prakash), పలు నిర్మాణ సంస్థలను బహిరంగ విచారణకు పిలువబోతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు విచారణ ప్రక్రియ కొనసాగిస్తూనే మరోవైపు విచారణకు సంబంధించిన రిపోర్ట్‌ను కమిషన్ తయారు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటివరకు జరిగిన విచారణ రిపోర్ట్‌ను కమిషన్ చీఫ్ జస్టిస్ పీసీ ఘోష్ తయారు చేశారు. మార్చి నెలాఖరు వరకు కమిషన్ పూర్తిస్థాయి రిపోర్ట్ తయారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఈ సెషన్‌లో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగించే కసరత్తు చేస్తోంది. మాజీ ఈఎన్సీలను మరోసారి బహిరంగ విచారణ పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నిబంధనలు పాటించకుండా నిధుల విడుదల

ఫైనాన్స్ అండ్ పాలసీ, టెక్నికల్ అంశాలపై విచారణ పూర్తి చేసిన కమిషన్.. నిబంధనలు పాటించకుండా నిధులు విడుదల చేసినట్లు గుర్తించింది. రూల్స్ పాటించకుండా ప్రభుత్వం కాంట్రాక్టర్లను మార్చిందని, పనులు పూర్తి కాకుండానే బిల్లులు విడుదల చేసినట్లు కమిషన్ గుర్తించినట్లు తెలుస్తోంది. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై సెక్షన్ 70 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Next Story